చెదిరిన చిరునవ్వు – సింహపురిలో వైసీపీ గుస గుస

Jagan Mohan Reddy Serious On His MLAs

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిలో మునుపటి సంతోషం లేదనిపిస్తోంది. ఆయన చిరునవ్వుతో కనిపించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారంటున్నారు. తుఫానులు, వరదలు, పంట నష్టాలు, కరోనా… ఇలా ఏ సందర్భంలోనూ సీఎం జగన్ ముఖాన చిరునవ్వు చెదిరేది కాదు. ఆ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు వస్తుండేవి. ఇప్పుడు మాత్రం ఆయన మొక్కుబడిగా నవ్వుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా ఉంటున్నారు.

బుధవారం జరిగిన జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక వివాహానికి సింహపురి వచ్చిన జగన్ .. అంత సంతోషంగా లేరనిపించింది కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదన్నట్లుగా ఆయన అనీజీగా కనిపించారు. అధికారులు బోకేలు ఇచ్చే సమయంలోనూ చిరునవ్వు కనిపించలేదు… జగన్ మొహంలో ఇంత ఆందోళన ఎప్పుడూ చూడలేదని వైసీపీ వాళ్లే చెబుతున్నారు..

వైసీపీకి వరుస దెబ్బలే జగన్ సీరియస్ నెస్ కు కారణం కావచ్చు. జగన్ సభలు, కార్యక్రమాలకు ప్రజా స్పందన లేకపోవడంతో సీఎం ఆలోచనలో పడ్డారన్న వాదన వినిపిస్తోంది. జగన్ మాట్లాడుతుండగానే జనం లేచి వెళ్లిపోతున్నారు. ఉన్న వాళ్లు కూడా ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వినడం లేదు. బుధవారం బీసీ సభలో కూడా అదే జరిగింది. చాలా గ్యాలరీలు బోసి పోయి కనిపించాయి. బస్సులు పెట్టి జనాన్ని తీసుకొచ్చినా, మందు పోసి, భోజనం పెట్టినా జనం ఉండటం లేదు. 2019లో ఎగబడి ఓటేసిన జనం ఇప్పుడు ఎందుకు మారిపోయారని జగన్ కు అర్థం కావడం లేదు. పైగా గడప గడపలోనూ వ్యతిరేకత కట్టలు తెంచుకుంటోంది. ప్రతీ రోజు వాటికి సంబంధించిన వార్తలతో వ్యతిరేక మీడియా పండుగ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ట్రోలింగులు పెరిగాయి..

ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్ ను ప్రధాని మోదీ నిలదీశారన్న మీడియా వార్తలు కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయి. అవుననలేరు..అలాగని కాదనలేరు. షర్మిలను హైదరాబాద్ పోలీసులు లాగి పడేస్తే ఏం చేస్తున్నారని మోదీ అడిగిన తీరుతో జగన్ ఖంగు తిన్నారు. అడిగిందీ ప్రధాని కాబట్టి మౌనంగా ఉండాల్సి వచ్చింది. కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో జగన్ ఉండిపోయారు. తాడేపల్లి చేరుకున్న తర్వాత ఢిల్లీ పరిణామాలను జగన్ సమీక్షించుకుని ఆందోళన చెందుతున్నారని సమాచారం. అందుకే ఆయన మొహంలో నవ్వు చెదిరిందంటున్నారు…