ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు.. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభ జయమో.. పరాజయమో.. ఏదో ఒకటి సాధించింది. ప్రతిపక్షాలు పరాజయం అంటే.. అధికార పార్టీ సహజంగానే జయమని చెప్పడం రివాజు కనుక.. దీని జోలికి పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. అయితే.. సభ సందట్లో వచ్చిన విమర్శలు.. ఇక్కడ కనిపించిన సీన్లు.. ఇప్పుడు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు కూడా!
ఇవీ..విమర్శలు..
- జయహో బీసీ సభకు వచ్చిన వారిలో అంతా పార్టీ వారేననే ప్రచారం ఉంది. ఇది నిజమో కాదో తెలియదు. మొత్తానికి వచ్చారు. మరి వీరెవరు? నిజంగానే జనాలు వచ్చారా? అనేది సందేహం. దీనినే ప్రతిపక్షాలు కార్నర్ చేశాయి.
- ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే చాలా మంది కుర్చీలు వదిలేసి పొలో మంటూ వెళ్లిపోయారు. ఇవన్నీ.. నిఘా కెమెరాలకే కాదు.. సాధారణ పౌరుల సెల్ ఫోన్ కెమెరాలకు కూడా చిక్కాయి. ఇలా ఎందుకువెళ్లిపోయారు? జగన్ ప్రసంగం బోరు కొట్టా? లేక.. ఇక, విన్నది చాలు.. అనుకునా?
- ఏకంగా సభా ప్రాంగణంలో మద్యం సీసాలను విచ్చలవిడిగా పంచేశారు. కిరాణా కొట్టును తలపించేలా ఈ పంపకాలు జరగడం నిజం. కానీ, పంచిందెవరు? అనేది ప్రతిపక్షాల ప్రశ్న.
- సీఎం జగన్ తన ప్రసంగంలో పదే పదే.. 80 వేల మంది సభలో పాల్గొన్నారని చెప్పారు. తీరా చూస్తే.. ఇందిరాగాంధీ మైదానంలో వెనుక సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి ఇలా ఎందుకు జరిగింది?
- బీసీల సభలో ఓసీల(సీఎం జగన్) భజన తప్ప. ఏమీ కనిపించలేదు. అంతేకాదు.. అసలు బీసీలకు సమస్యలే లేవన్నట్టుగా సాగిన ప్రసంగాలు విస్తుపోయేలా చేశాయనే విమర్శలు వస్తున్నాయి.
- బీసీ సభకు ప్రభుత్వమే నిధులు సమకూర్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సుమారు 20 కోట్ల ను ఈ సభకు ఇచ్చిందని అంటున్నారు. ఇదే నిజమైతే.. విస్తృత రాష్ట్ర ప్రజానీకం కట్టిన పన్నులను ఇలా.. చేయడం తగునా? ఇవన్నీ.. ప్రశ్నలే కాదు.. విమర్శలు కూడా! సో.. సభ అయితే, ముగిసింది.. ఇలాంటివి ఎన్నో మిగిలిపోయాయి. ఎవరు స్పందిస్తారో చూడాలి.