టీడీపీలో లోకల్ పాలిటిక్స్

టీడీపీకి సమస్యలు తప్పడం లేదా … పోటీ విషయంలో నేతలు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయా…. తాజా పరిణామాలతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారా.. అందుకే మీటింగులు పెట్టి అధిష్టానానికి వినతులు పంపుతున్నారా..

నియోజకవర్గాల వారీగా నే
స్థానికులకే టికెటివ్వాలని తీర్మానాలు
ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో పోటీ
ఎటూ తేల్చని టీడీపీ అధిష్టానం
పొత్తులపైనా లేదు క్లారిటీ
అనేక నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించని చంద్రబాబు
ఓటమికి కారణమైన నేతల్లో కొత్త భయాలు

అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన వేళ టీడీపీలో స్థానికత సమస్య వచ్చిపడింది. స్థానిక నేతలను కాదని బయటవారికి అధిష్టానానికి టికెట్లు ఇస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానితో నేతలు, కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇంతకాలం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా విజయావశాలున్నాయని లెక్కలు కట్టి వెలుపల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే చాన్సుందని ఆయా నియోజకవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల సత్తెనపల్లిలో ఒక భేటీ నిర్వహించారు. అందులో నియోజవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బయటవారికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని, స్థానికులకే కేటాయించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. ఐకమత్యంగా ఉంటూ స్థానికులకే టికెట్ సాధించాలని కూడా నిర్ణయించారు. ఈ పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది…

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత దాదాపు రెండేళ్లపాటు పార్టీ శ్రేణులు నిర్వీర్యంగా పడున్నాయి. సీఎం జగన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి గెలుస్తామన్న విశ్వాసంతో వారు పనిచేస్తున్నారు. అయితే టికెట్టు ఎవరికి ఇస్తారో అర్థం కాక కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. అందుకు అధిష్టానం నుంచి సందేశం రావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

ఈ లోపే పక్క నియోజకవర్గాల నేతలు వచ్చి తమ సెగ్మెంట్లలో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం స్తానిక నేతల్లో కనిపిస్తోంది. పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం లోపం కనిపిస్తోంది. దానితో ఇతర ప్రాంతాల నుంచి నేతలు దిగుమతి అవుతూ రోజువారీ మీటింగులు పెట్టి తమ ఉనికిని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయట నుంచి కార్యకర్తలను తెచ్చి తిప్పుతూ.. తమకు పరపతి ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు…

పార్టీలో స్థానిక నాయకత్వం బలహీనపడటానికి చాలా కారణాలే చెబుతున్నారు. అందులో ఇంఛార్జ్ పదవులు కూడా ఒకటిగా ఉంది. ఆ దిశగా అధినేత చంద్రబాబు తప్పిదం కూడా ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి నుంచి పూతలపట్టు వరకు అనేక నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ పదవులు ఇంతవరకు భర్తీ చేయలేదు. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలే చాలా తక్కువ. మరి నియోజకవర్గ పార్టీని ఎవరు నడిపిస్తారనేదే పెద్ద సమస్యగా మారింది.

అసెంబ్లీ ఇంఛార్జ్ లను పెట్టి ఉంటే స్థానికంగా ఏ సమస్య వచ్చినా వాళ్లు చూసుకునేవారు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు తరచూ నిర్వహించే సమీక్షల్లో కూడా ఇంఛార్జ్ ల నియామకం ప్రస్తావనకు వస్తోంది. త్వరలోనే ఆ పని పూర్తి చేద్దామని అధినేత చెబుతున్నప్పటికీ ఆ పనికి రోడ్ మ్యాప్ ఏమీ ఇవ్వడం లేదు. అసెంబ్లీ ఇంఛార్జ్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అన్న టాక్ రావడంతో నియామకానికి కూడా అధిష్టానం వెనుకంజ వేస్తోంది. పైగా ఇంఛార్జ్ నియమించిన తర్వాత మిగతా ఆశావహులు అసమ్మతి రాజకీయాలు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని భయపడుతున్నారు…

పొత్తుల కసరత్తు కూడా స్థానిక నాయకత్వంపై ప్రభావం చూపుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఆ చర్చలు ఇంకా కొలిక్కిరాకపోయినా నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ అంతగా పట్టించుకోకపోయినా జనసేన కార్యకర్తలు, నేతలు దూకుడును పెంచారు. నియోజకవర్గాన్ని తమ పార్టీకి కేటాయిస్తారని చెప్పుకుంటూ కొన్ని చోట్ల ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేశారు.

టీడీపీ కంటే వేగంగా సాగుతున్న వారి ప్రయత్నాలు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు. నిజంగానే నియోజకవర్గం చేజారిపోతుందా అన్న భయం వారిలో నెలకొన్నది. అధిష్టానవర్గం నుంచి వివరణ పొందాలనుకున్నా ఎలాంటి సందేశముూ వస్తుందన్న నమ్మకం కలగడం లేదు. పైగా ఉమ్మడి జిల్లాల లెక్కన… ఏ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయిస్తారో క్లారిటీ రావడం లేదు. ఇప్పటి నుంచి కాళ్లరిగేలా తిరిగి…. ఉన్నడబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని జేబులు ఖాళీ చేసుకుంటే..సరిగ్గా ఎన్నికల ముంగిట ఇతర పార్టీలకు నియోజకవర్గాన్ని కేటాయిస్తే పరిస్తితేమిటన్న ప్రశ్న వారిలో మెదులుతోంది. స్థానికంగా తాము పనిచేస్తుంటే ఇతర పార్టీలు అభ్యర్థులు గెలిచి పెత్తనం చెలాయిస్తారని వాపోతున్నారు…..

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకంగా ప్రవర్తించి ఓటమికి కారణమైన కొందరి భవితవ్యం కూడా ఇప్పుడు ఆగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికీ స్థానికంగా వారికి కొంతమేర కార్యకర్తల బలమున్నప్పటికీ ఆయా నాయకులకు విజయవాకాశాలు లేవని అధిష్టానం నమ్ముతోంది. దానితో క్రియాశీలంగా ఉండాలా వద్దా అన్న ఆలోచనా వారిలో కలుగుతోంది.అలాంటి కొందరు నాయకులు తమ మందీ మార్బలాన్ని వెంటబట్టుకుని అధిష్టానం దగ్గరకు వెళ్తున్నారు. చెప్పిందంటా వింటున్న అధిష్టానం వారికి టికెట్ ఖాయమన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు. దానితో స్థానికంగా పనిచేయాలా..పొరుగు నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలో అర్థం కాక వారు ఇరకాటంలో పడిపోతున్నారు. అలాంటి నాయకులతో స్థానికంగా కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రూపులు కట్టి వారు పార్టీని ఎదగనివ్వడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి.