ఏపీ అధికార పార్టీ వైసీపీ విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు అదే సమయంలో ప్రతిపక్షం టీడీపీ చెక్ పెట్టింది. వైసీపీ నిర్వహించిన సభకు ప్రతిగా టీడీపీ తీసుకువచ్చిన JayahoBC అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా #TDPJayahoBC అనే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఐ-టీడీపీ విభాగం దీనిని ఆన్‌లైన్‌లో ట్రెండ్ చేసింది.
తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ బీసీ వర్గాలు, బీసీ యువత ట్వీట్స్‌తో జోరెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన సంక్షేమాన్నివిస్మరించి.. నవరత్నాల పేరుతో అన్యాయం చేస్తోందని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా యాదవ, రజక, చేనేత వృత్తి కులాలకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్న భావనను వ్యక్తం చేశారు. పేదరికంలో మగ్గుతున్న యాదవులకు ప్రభుత్వం చేసింది శూన్యమని వాపోతున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పనిముట్లను నిలిపేశారని పలువురు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆయా కులాల స్వయం ఉపాధి పథకాలను అమలు చేసిందని పలువురు తెలిపారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎత్తేసిందని వారు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో గౌడ, అగ్నికుల క్షత్రియ కులాలకు కూడా గతంలో ఉన్న పలు పథకాలను రద్దు చేసిందని వైసీపీ పై నిప్పులు చెరిగారు. మొత్తానికి వైసీపీ బీసీ సభకు ప్రతిగా ఆన్‌లైన్‌లో టీడీపీ చేసిన ప్రయోగం సక్సెస్ కావడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates