చెవిలో చిన్న‌మాట‌: బీసీల‌కు న్యాయం చేసిన‌ట్టేనా?

ఏపీ అధికార పార్టీ వైసీపీ.. తాజాగా బీసీ గ‌ర్జ‌న పేరుతో పెద్ద ఎత్తున స‌భ పెడుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత నిర్వ‌హిస్తున్న ఈ స‌భ ద్వారా .. బీసీ వ‌ర్గాల‌ను పార్టీకి చేరువ చేసుకునే ప్ర‌య‌త్నం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, ఇది కొంచెం సేపు ప‌క్క‌న పెడ‌దాం. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కుల‌ను క‌దిపితే.. తాముఎంతో చేశామ‌ని చెబుతున్నారు. బీసీల‌ను మేం రెడ్ కార్పెట్ వేసి న‌డిపిస్తున్నామ‌ని చెబుతున్నారు. కార్పొరేష‌న్ నుంచి మంత్రి వ‌ర్గం వ‌ర‌కు బీసీల‌కు జ‌గ‌న్ పెద్ద‌పీట వేశార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చేప‌ట్టిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో భాగంగా బీసీల‌కు పెద్ద‌పీట వేసిన విష‌యం వాస్త‌వ‌మే. అయితే.. వారికి ప‌ద‌వులు ఇచ్చి.. అధికారం దూరం చేశార‌నేది ప్ర‌తిప‌క్షాల వాద‌న‌. ఇక‌, బీసీ మంత్రులుగా ఉన్న గుమ్మ‌నూరు జ‌య‌రాం కానీ, ప్ర‌స్తుత తాజా మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ కానీ ప్ర‌జ‌ల మెప్పును పొందారా? పోనీ బీసీ వ‌ర్గాల్లో అయినా ప‌లుకుబ‌డి ఉందా? అంటే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. ఇదే విష‌యంపై విజ‌య‌న‌గ‌రంలో మాట్లాడుతూ.. నాదేం లేదు.. అంతా సీఎందే అని ఉద్యోగుల విష‌యంలో తేల్చి చెప్పారు.

అంటే.. బీసీలు మంత్రులుగా ఉన్నారు. కానీ, వారికి ఎలాంటి అధికారాలు లేవు. అనే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రోవైపు.. కార్పొరేష‌న్లు తీసుకున్నా.. మునిసిపాలిటీలు తీసుకున్నా బీసీల‌కు పెద్ద ఎత్తున ప‌ద‌వులు ఇచ్చారు. కానీ, ఇక్క‌డ కూడా సేమ్ టు సేమ్‌! వారికి నిధులు లేవు.. విధులు అంత‌క‌న్నాలేవు. ఇది నాణేనికి ఒక‌వైపు. మ‌రో వైపు చూద్దాం.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌స‌మ‌యంలో బీసీల‌కు ప్ర‌త్యేకంగాకొన్ని ప‌థ‌కాలు అమ‌లు చేశారు. కానీ, ఇప్పుడు వాటిని ఎత్తేసి.. ఒకే సంక్షేమం పేరుతో స‌గానికి స‌గం మంది ల‌బ్ధిదారుల‌కు కోత‌పెట్టి ముందుకుసాగుతున్నారు.

ఈ ప‌రిణామాల‌తో స‌హ‌జంగానే స‌ర్కారుపై బీసీల్లో ఆవేద‌న‌, ఆగ్ర‌హం అన్నీ ఉన్నాయి. నిజానికి ఈ ఆగ్ర‌హాన్ని, ఆవేద‌న‌ను గ‌తంలోనూ వైసీపీ గుర్తించింది. అందుకే ఈ ఏడాది మేలో బీసీ మంత్రుల‌తో క‌లిసి బ‌స్సు యాత్ర‌లు నిర్వ‌హించింది. కానీ, ఆ యాత్ర‌లు స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టికి.. ఇన్నాళ్ల‌కి స‌భ పెట్టింది. ఏదో చేస్తున్నాం.. ఎన్నో చేస్తున్నాం.. అని చెబుతున్న స‌ర్కారుకు అంత‌ర్గ‌త సెగ త‌గులుతుండ‌డం వ‌ల్లే.. త‌న‌ను తాను త‌డిమి చూసుకునే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.