వైసీపీలో ఉద్యోగుల గుబులు..?

అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. చేస్తాన‌న్న ప‌ని చేయ‌లేదు. ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల గుబులు ప‌ట్టుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏ ప్ర‌భుత్వానికైనా ఉద్యోగులు కీల‌కం. వారు ఓటింగ్ ప్ర‌క్రియ‌ను ప్రభావితం చేస్తారా? చేయ‌రా? అనేది ప‌క్క‌న పెడితే.. వారి మౌత్ ప‌బ్లిసిటీ కార‌ణంగా.. ల‌క్ష‌ల ఓట్లు ప్ర‌భావితం అయితే అవుతాయి. గ‌తంలో ఎన్టీఆర్‌, త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వాలు కుప్ప‌కూలింది.. ఈ కార‌ణంగానే అనే చర్చ ఉండ‌నే ఉంది.

ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ప్ర‌భుత్వంలో ఉద్యోగుల గుబులు పెరిగిపోయింది. తాజాగా, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను చ‌ర్చ‌కు ఆహ్వానించిన ప్ర‌భుత్వం, ఈ చ‌ర్చ‌ల‌ను స‌క్సెస్ చేసుకునేందుకు ప‌డిన త‌ల‌నొప్పులు అన్నీ ఇన్నీకావు. నిజానికి సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. అయితే, దీనిపై చ‌ర్చ‌ల‌కు మ‌రోసారి పిలిచేస‌రికి.. ఠారెత్తిన ఉద్యోగులు రాం పొమ్మ‌న్నారు. దీంతో ఈ ప‌రిణామం.. స‌ర్కారుకు సెగ‌పెట్టింది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం పిలిచినా ఉద్యోగులు రాలేదంటే అది వ్య‌తిరేక ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌భుత్వం భావించింది.

వెంట‌నే వ్యూహాన్ని మార్చుకుని పెండింగు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిద్దాంర‌మ్మంటూ మ‌రో పిలుపునిచ్చింది. దీంతో వారు వెళ్లారు. ఇక‌, స‌మావేశంలో ఏం జ‌రిగింది? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయా..? అంటే.. “చెట్టుపై నుంచి శ‌వాన్ని దించి భుజాన వేసుకున్న విక్ర‌మార్కుడు మౌనంగా న‌డిచివెళ్లి”న క‌థే రిపీట్ అయింది. ఇక‌, ఈ మొత్తం ఎపిసోడ్‌లో క‌నిపించిన అంశాలు రెండే రెండు. ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను ప‌రీక్షిస్తోంది. త‌మ‌పై ప్ర‌భావం చూపించే స్థాయి ఉందా? లేదా.. అనేది తెలుసుకుంటోంది.

మ‌రోవైపు.. తాము చేయాల‌ని అనుకున్న వాటినే చేస్తోంది. ఈ రెండు కారణాల‌పైనే ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇంత‌కు మించి స‌ర్కారుకు మ‌రో ల‌క్ష్యం క‌నిపించ‌డం లేద‌ని.. మేధావులు సైతం అంటున్నారు. అంటే మొత్తంగా ఈ ప‌రిణామం వైసీపీలో కొన‌సాగుతున్న గ‌బుల‌కు అద్దం ప‌డుతోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. మొత్తానికి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏం చేస్తారో చూడాలి.