టీడీపీలో బిగ్ షాట్‌కు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్లు వనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి పదవులు సహా అన్నీ అనుభవించి.. అదే స్థాయిలో పార్టీ కోసం పాటుపడినా.. గత కొన్నేళ్లుగా మాత్రం పార్టీకి పెద్దగా ఉపయోగపడని యనమల రామకృష్ణుడిని చంద్రబాబు ఇక పక్కనపెట్టనున్నట్లు వినిపిస్తోంది.
ముఖ్యంగా యనమల తన సొంత నియోజకవర్గం తునిలో పోటీ చేయడానికి ఆసక్తి చూపకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యసభను పదేపదే కోరుతుండడం… తునిలో యనమల సోదరుడు గెలవలేకపోతుండడంతో ఎన్నికల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈసారి అక్కడ యనమల ఫ్యామిలీని పక్కన పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
తునిలో యనమల ఫ్యామిలీకి ఇక ఓట్లు పడవని.. వారిని బరిలో దించితే ఆ సీటు పోయినట్లేనని సర్వేలూ తేల్చడంతో చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలోనే తుని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న రాజా అశోక్ బాబును టీడీపీలోకి తేనున్నట్లు టాక్. క్షత్రియులలో మంచి పాపులారిటీ ఉన్న రాజా అశోక్ బాబు ఇటీవల చంద్రబాబును కలిశారు కూడా.
గత రెండు పర్యాయాలుగా తునిలో వైసీపీ గెలుస్తోంది. అక్కడి నుంచి గెలిచిన దాడిశెట్టి రాజా రోజురోజుకూ పట్టుపెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగానూ ఉండడం మరింత కలిసొచ్చిన అంశం కావడంతో ఆయన్ను ఓడించాలంటే యనమల ఫ్యామిలీ కాకుండా వేరే అభ్యర్థి అవసరమని చంద్రబాబు గుర్తించారు. ఆ క్రమంలోనే అశోక్ బాబు తెరపైకి వచ్చారు.
అశోక్ బాబు 2009లో తునిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన పోటీ చేయడం మానేసి యనమల కుటుంబానికి మద్దతిస్తూ వస్తున్నారు. వివాద రహితుడు కావడం… టీడీపీలో చేరనప్పటికీ స్థానిక టీడీపీ నేతలందరితో మంచి సంబంధాలు ఉండడం… నియోజకవర్గం అంతటా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన్ను ఈసారి బరిలో దించడమే సరైనదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates