అవును.. ఇది నిజంగానే హెచ్చరిక. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అతితీవ్ర హెచ్చరిక అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా, ప్రజానేత అయినా.. ఎప్పటికప్పుడు తన గ్రాఫ్‌ను ప్రజల్లో ఎంతుందో పోల్చుకుని, కొల్చుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని.. పుంజుకునే ప్రయత్నం కూడా చేస్తారు.
ఇలానే జనసేన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఇటీవల జరిగిన పరిణామాలు.. పవన్ దూకుడు వ్యాఖ్యలు .. వంటి నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రజల మధ్యకు వచ్చాయి. ప్రజల నుంచి సమాచారం సేకరించాయి. అసలు పవన్ గురించి ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. దీనిలో ర్యాండమ్‌గా నాలుగు జిల్లాల్లో ప్రజల ఉద్దేశాలను తెలుసుకున్నాయి.
వీటి ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే.. పవన్ పట్ల కొంత వరకు ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇక్కడ కూడా కాపువర్గంలో సగం మంది మాత్రమే ఆయనను కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. కాపు వర్గానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు మాత్రం పవన్‌ను తిరస్కరిస్తున్నారు. కేవలం యువత మాత్రమే పవన్‌కు ఓటేస్తామని ఆయనను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని అంటున్నారు. కానీ, వ్యాపారుల విషయానికి వస్తే ఇది రివర్స్ అవుతోంది.
“ఆయనకు విధానాలు లేవు. ఎలా సమర్ధించాలి. ఓటేసినా వృథా` అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో వారు అసలు పవన్‌ను ఒక రాజకీయ నేతగానే వారు గుర్తించడం లేదు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. “ఓటు కావాలనే వారు ఎవరైనా ప్రజలను కలవాలి. ఏదో ఒకచోట ప్రసంగించి, కొంటె మాటలు మాట్లాడి. చెప్పులు చూపిస్తే ఎవరుమాత్రం ఓటేస్తారు? ఆయన ఎప్పుడైనా.. ప్రజల మధ్యకు వచ్చి.. ఇంటి ముందుకు వచ్చి ఓటడిగారా? వేస్తే రేపు ఏం చేస్తారు? మళ్లీ చంద్రబాబును సీఎం చేస్తారు” అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి పవన్ జాగ్రత్త పడడం తప్పదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates