రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీలకనాయకులు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేతలు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండడంతో రాజకీయంగా కూడా ఈ దాడులు చర్చకు దారితీశాయి.
రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు దాడులు చేయడం గమనార్హం.
ఇక, రాజకీయ నేతల విషయానికి వస్తే.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరుడిగా మారిన వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత,బెజవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవినాష్ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో హవాలా మార్గంలో అవినాష్‌కు డబ్బులు చేకూరాయన్న విషయంపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.