వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో పొలిటికల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. క్రికెట్‌లో సెమీస్ మాదిరిగా.. రాజకీయంగా కూడా ఏపీలో సెమీస్‌లోకి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు చేరిపోయాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే అధికార పార్టీ.. రెండు కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. ప్రజలను కలిసేలా.. నేతలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. ఒకానొక దశలో వారిని ఆదేశిస్తున్నారు కూడా.
ప్రజల్లో ఉంటేనే టికెట్లు అని కూడా చెబుతున్నారు. దీంతో నాయకులు భక్తో.. భయమో.. మొత్తంగా ప్రజలను కలుసుకుంటున్నా రు. ఈ క్రమంలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. మొత్తం 175 స్థానాలకు 175 దక్కించుకునే వ్యూహాన్ని కూడా జగన్ అమలు చేస్తున్నారు. ఇది సాధ్యమా.. అసాధ్యమా.. అనేది పక్కన పెడితే.. ప్రజలను ఆలోచనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వైనాట్ 175’ అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇది కూడా ప్రజల్లోకి బాగానే చేరుతోంది.
ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా రెండు కీలక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఒకటి బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ధరలను ఎలా పెంచిందో వివరిస్తోంది. పన్నుల మోత మొగిస్తూ.. ప్రజలను ప్రభుత్వం పీడించుకుతింటోందనే భావనను ప్రజల్లోకి టీడీపీ నాయకులు తీసుకువెళ్తున్నారు. కరోనాతో రెండేళ్ల సమయం వృథా అయినా.. తర్వాతకాలం అంతా కూడా తమకు ప్రయోజనం కలిగించేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కూడా ప్రజల మధ్య ఉంటున్నారు.
ఇక, తాజాగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కీలక నినాదంతో ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజల నోటితోనే ఈ నినాదాన్ని అనిపిస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోనూ జోష్ పెరిగిందనే చెప్పాలి. దీంతో ఈ రెండు పార్టీలు కూడా దాదాపు సెమీస్‌కు చేరుకున్నట్టే అయింది. అయితే.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు నిలుస్తారు? అనేది మాత్రం ప్రజలు తేల్చాల్సి ఉంది. ఇక, నాయకుల విషయానికి వస్తే.. ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను కూడా బద్దకిస్టులు.. చాలా మందే కనిపిస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేస్తారా? లేక.. వారి ఆర్థిక, అంగ బలాలను బట్టి కొనసాగిస్తారా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates