వైసీపీ అధినేత జగన్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా చూసేందుకు, చేసేందుకు అనేక మంది నాయకులు కష్టపడ్డారనేది తెలిసిందే. ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఆయనతో పాటు కలిసినడిచారు. ఆయన పాదంలో పాదం కలిపారు. కొందరు ఆస్తులు అమ్మి మరీ ఖర్చు చేస్తే.. మరికొందరు అప్పులు చేసి తీసుకువచ్చి .. జెండాలు కట్టారు. ఇలానే.. కర్నూలుకు చెందిన ఒక ముస్లిం యువతి కూడా జగన్ సీఎం కావాలని కలలు కన్నారు. వైసీపీ అధికారంలోకి రావాలని అభిలషించారు. తనవంతుగా.. పార్టీ కోసం అహరహం శ్రమించారు. అయితే, ఇప్పుడు ఆమె రోడ్డున పడ్డారు. తనను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘జగనన్న అంటే పిచ్చి అభిమానం.. ఆయనను సీఎంగా చూడాలని 12 ఏళ్లుగా వైసీపీ అభివృద్ధి కోసం పని చేశాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరహార దీక్షలు చేశాను.. లాఠీల దెబ్బలు తిన్నాను. అధికారంలోకి వచ్చాక నాలాంటి కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోంది. కనీసం సీఎం జగన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు’ అని కర్నూలుకు చెందిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమిలా బేగం కన్నీరు పెట్టుకున్నారు.
తన బాధ చెప్పుకునేందుకు సీఎం జగన్ అవకాశం ఇవ్వాలని కోరుతూ అర్ధరాత్రి కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ విగ్రహాం వద్ద దీక్ష చేపట్టారు. ’12 ఏళ్లుగా వైసీపీ కోసం అహర్నిశలు పని చేశాను. జనగ్ అంటే మాకు ఎంతో పిచ్చి. ఆయనను సీఎంగా చూడాలని ఎంతో కష్టపడ్డాం. పార్టీ కార్యక్రమాల్లో పడి నేను వెళ్లి కూడా చేసుకోలేదు. వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాను’ అని అన్నారు. తన లాగా చాలా మంది పని చేశారని, అధికారంలోకి వచ్చాక అన్యాయం జరుగుతోందని అన్నారు.
తమ బాధలు చెప్పుకుందామంటే సీఎం జగన్ కలిసే అవకాశం ఇవ్వడం లేదని, పదవుల పంపకాల్లో తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో దీక్షను చేపట్టానని వివరించారు. మొత్తానికి ముస్లిం యువతి ఆవేదన.. జగన్ సీఎం అయ్యేందుకు చేసిన త్యాగం ప్రస్తుతం వైసీపీలో చర్చకు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా జగన్ కరుణిస్తారా? లేదా? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates