టీడీపీ ఫాలోయింగ్‌తో వైసీపీలో బెరుకు మొద‌లైందా..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఫాలోయింగ్‌ను చూసి అధికార పార్టీ వైసీపీ బెరుకుతోందా? అంటే.. ప్ర‌తిప‌క్షాలు ఔన‌నే అంటున్నాయి. కానీ, ప‌రిశీల‌కులు మాత్రం వైసీపీ జాగ్ర‌త్త ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఎందుకం టే.. ప్ర‌జ‌లకు ఇప్పుడు స‌మాచార వ్య‌వ‌స్థ చాలా చేరువైంది. ఎక్క‌డ ఎప్పుడు ఏం జ‌రిగినా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది.

ఇది ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న తీరు కూడా బాగానే ఉంది. గ‌తంలో ఒక సామెత ఉన్న‌ట్టుగా.. ఒక విష‌యాన్ని ప‌దే ప‌దే చెబితే.. అదే నిజ‌మ‌నుకునే ప‌రిస్థితి ప్ర‌తి విష‌యంలోనూ ఉంటుంది. ఇదే వైసీపీని క‌ల‌వ‌ర పెడుతోం ది. ఒక‌వైపు తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నా.. ప్ర‌జ‌ల దృష్టి ఎక్క‌డ ఎటు నుంచి త‌మ‌వైపు జారిపోతుంద‌నే ఆవేద‌న, ఆందోళ‌న ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. అందుకే.. కొంత ముందు జాగ్ర‌త్త ప‌డుతున్న మాట వాస్త‌వం.

ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ఎప్పుడు ఎలా మాట్లాడినా.. త‌న పాల‌నను చూడాల‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో గ‌త పాల‌న‌తోనూ ఆయ‌న కంపేర్ చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌.. ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ఇంత సునిశితంగా ప‌రిశీలించిన సంద‌ర్భం మ‌న‌కు క‌నిపించ‌దు.

కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గాన్నీ నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల ప్రాధాన్యాన్ని వివ‌రిస్తున్నారు. ఈ ఒక్క‌సారి గెలిస్తే.. తిరుగులేద‌నే సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా పంపిస్తున్నారు. సంక్షేమాన్ని సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. ఇక‌, స‌ర్వేల రూపంలో నూ ఆయ‌న స‌మాచారం తీసుకుంటున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉనప్ప‌టికీ.. రాష్ట్రంలో మాత్రం ఎన్నిక‌ల జోరు పెరిగింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.