ఏపీ రాజ‌కీయాల్లో ‘వెంట్రుక’ లాగిజ‌మ్‌!

ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నేత‌ల్లో ప్ర‌స్టేష‌న్ బాగా పెరిగిపోతోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో పార్టీల అధినేత‌ల మొద‌లు కింది స్థాయి చోటామోటా నాయ‌కుల వ‌ర‌కు కొన్ని సార్లు బూతు పురాణం అందుకుంటున్నారు. కొంత‌మంది నేత‌లైతే వారు మాట్లాడే భాష వినాలంటే చెవులు మూసుకోవాల్సి వ‌స్తోంది. అంత‌గా నేత‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పైన మాట్లాడే స‌మ‌యంలో కంట్రోల్ త‌ప్పుతున్నారు. ఒక‌ప్పుడు ఒక చిన్న ప‌రుష ప‌ద‌జాలం అనాలంటే నాయ‌కులు చాలా సంకోచించేవారు. మ‌రీ ప్ర‌స్టేష‌న్ ఎక్కువైన సంద‌ర్భాల్లో చాలా అరుదుగా ఎక్క‌డైనా ఒక చిన్న మాట తూలేవారు. అది త‌రువాత రాజ‌కీయ ధుమారం రేపేది.

ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా ఏపీ రాజ‌కీయాల్లో ట్రెండ్ మారిపోయింది. బూతుపుర‌ణాలు, అస‌భ్య ప‌ద‌జాలాల ప్ర‌యోగం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ‘పీక‌లేరు’ అనే ప‌దం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఇప్పుడొక ఊత‌ప‌దంలా మారిపోయింది. వైరి ప‌క్ష నేత‌ల‌నుద్దేశించి పార్టీల అధినేత‌లు ఏకంగా ‘వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు’ అని చాలా సులభంగా యథాలాపంగా అనేస్తున్నారు. వై.ఎస్‌.జ‌గ‌న్‌, నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌, వైసీపీ మంత్రుల్లో కొడాలి నానీ లాంటి నేత‌లు, టీడీపీ నేతలు ఈ ప‌దాన్ని ప్ర‌స్టేష‌న్‌లో ఉప‌యోగించేస్తున్నారు.

గత ఏప్రిల్ నెల‌లో నంద్యాల‌లో జ‌రిగిన జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం బ‌హిరంగ స‌భలో ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ బ‌హిరంగ వేదికపై ప్ర‌తిప‌క్షాల‌నుద్దేశించి మాట్లాడుతూ వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు అన్న మాట పెను దుమారం సృష్టించింది. దీనికి కౌంట‌ర్‌గా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ లు కూడా ఇదే ప‌దాన్ని అందుకుని ప‌లు స‌భ‌ల్లో ఎదురు దాడి చేశారు. వైసీపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేర‌ని చిన‌బాబు దూకుడు పెంచారు. ఇక కిందిస్థాయి టీడీపీ, వైసీపీ నేత‌లు అయితే విమ‌ర్శ‌లు, తీవ్ర ప‌ద‌జాలాలు, దూష‌ణ‌ల ప‌ర్వంతో తెగ‌రెచ్చిపోతున్నారు.

టీడీపీలో బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, గ్రీష్మ‌, వంగ‌ల‌పూడి అనిత లాంటి నాయ‌కులు వైసీపీలో కొడాలి నానీ, పేర్ని నాని, జోగి ర‌మేష్‌, దువ్వాడ శ్రీను త‌దిత‌ర నేత‌లంతా మ‌రింత ముందుకెళ్లి దూష‌ణ‌ల ప‌ర్వాల‌కు కూడా దిగుతున్నారు. దీంతో ఒక్కోసారి నాయ‌కులు భూతు పురాణం విన‌డానికే జ‌నాల‌కు జుగుప్స క‌లిగిస్తోంది. ప్రెస్‌మీట్ల‌లో వీరు బొచ్చుపీక‌లేరు, గూట్లే, బ‌చ్చా, లుచ్చా, నా కొడ‌కా లాంటి తిట్ల దండ‌కాలు ఏమాత్రం సంకోచం లేకుండా వ‌ల్లించేస్తుంటారు.

ఒక‌ప్పుడు వెంట్రుక పీక‌లేవు అంటే ప‌ర‌మ బూతు ప‌దంగా చూసేవారు. ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు ఏ మాత్రం ఏవ‌గింపు లేకుండా ఈ తిట్టు ప‌దాన్ని య‌థేచ్ఛ‌గా వింటున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతూ సంక‌ల్ప‌సిద్ధి కుంభ‌కోణంలో సీఐడీ పోలీసులు, పోలీసులు ఏం పీకుతున్నారు అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నేత‌లు త‌క్కువేమీ తిన‌లేదు. అక్క‌డ కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచీ అన్ని పార్టీల నాయ‌కులు తిట్ల దండ‌కం ఎత్తుకుంటుంటారు.