లిక్కర్ స్కాం – కవిత కు మరింత దగ్గరగా

తెలంగాణ బతుకమ్మకు కష్టాలు తప్పేలా లేవు. కవిత పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్లు చేతులు మారినట్లు భావిస్తున్న స్కామ్ లో ఆమెను ప్రశ్నించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల ఆరున సిబిఐ అధికారులు హైదరాబాద్ వచ్చి ఆమె నివాసంలో కవితను ప్రశ్నిస్తారు. ఇంట్లోనే మాట్లాడతానని కవిత ఛాయిస్ తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు కావడంతో సీబీఐ కూడా అందుకు అంగీకరించింది…

స్కాముకు సంబంధించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చిన తర్వాత పరిణామాలు చకచకా కదిలిపోయాయి. రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించిన 48 గంటల్లోపే కవితకు నోటీసులు అందాయి. రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన ఈడీ కాకుండా ఈసారి సిబీఐ రంగంలోకి దిగింది. సిబీఐ వంతు పూర్తయిన తర్వాత ఈడీ రంగంలోకి దిగుతుందనుకోవాలి.

రెండు దర్యాప్తు సంస్థలు విడివిడిగా నట్లు బిగించే అవకాశం ఉంది. కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చేందుకు సరైన సాక్ష్యాధారాలు సేకరించాలని రెండు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కేసును నీరుగార్చకుండా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు వేర్వేరు సెక్షన్ల క్రింద ఫిక్స్ చేయాలని దర్యాప్తు సంస్థలు డిసైడయ్యాయి.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కవిత పాత్ర ఉందని.. ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపణలు వినిపించాయి. ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. వారికి సౌత్ గ్రూప్, సౌత్ కార్టెల్ అని పేరు పెట్టారు. కవిత, శరత్‌ చంద్రారెడ్డి, మాగంటి, మనీశ్‌సిసోడియాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చేసి, తర్వాత వాటిని ధ్వంసం చేశారని.. అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ. 1.30 కోట్లుగా ఉంటుందని ఈడీ రిమాండ్ రిపోర్టు ద్వారా న్యాయస్థానానికి తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా రూపొందించిన మద్యం పాలసీ కారణంగా వంద కోట్ల రూపాయలు ముడుపులు అందినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

డిసెంబరు ఆరున కవితను ప్రశ్నించిన తర్వాత ఏం జరుగుతుందన్నదే పెద్ద ప్రశ్న..కవిత చెప్పిన సమాధానంతో కన్విన్స్ అయి సీబీఐ అంతటితో వదిలేస్తుందో లేదో చూడాలి. ఇంకా ప్రశ్నించాల్సి ఉందీ.. ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుస్తుందా…సీబీఐ పని పూర్తయిన తర్వాత ఈడీ రంగంలోకి దిగొచ్చు. కవితపై ప్రశ్నల వర్షం కురిపించొచ్చు. అందుకే పిక్చర్ అభీ బాకీ హై అనుకోవాలి…