ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు రావడం గగనంగా మారిన మాట వాస్తవం. అంతే కాదు ఉన్న పరిశ్రమలు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయన్నదీ నిజం. ఈ విషయంలో మీడియా ఊరికే రాద్దాంతం చేస్తోందని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే సరిపోదు. వాస్తవంగా ఏం జరుగుతోందో జనం చూస్తూనే ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ‘కియా’ మాదిరి రాష్ట్రంలోకి ఒక్క పెద్ద పరిశ్రమ అయినా వచ్చిందా.. భారీగా పెట్టుబడులు పెట్టి వేల ఉద్యోగాలు ఇచ్చిందా అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. చివరికి దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటైన అమర్ రాజా తమ సొంత రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద ఉన్న పరిశ్రమను వెళ్లిపోకుండా ఆపగలిగారు కానీ.. కొత్త పెట్టుబడులు మాత్రం పెట్టించలేకపోయారు.
ఇప్పుడు అమర్ రాజా ఏకంగా 9500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీకి సిద్ధం కావడం గమనార్హం. శుక్రవారం హైదరాబాద్‌లో ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది అమర్ రాజా సంస్థ. విద్యుత్ వాహనాలకు అవసరం అయ్యే బ్యాటరీల యూనిట్‌ను తెలంగాణలో అమర్‌రాజా ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా అమర్ రాజా అధినేత గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. తమ పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ ఏపీకే పరిమితం అవుతున్నాయని.. అందుకే తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం మీదా ఆయన ప్రశంసలు కురిపించారు. అంతే తప్ప ఎక్కడా ఏపీలో ఈ ప్లాంటు ఎందుకు పెట్టట్లేదని క్లియర్‌గా చెప్పలేదు. అందుకు కారణం జగన్ సర్కారు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తమ పార్టీ ఎంపీనే అయిన జయదేవ్‌ను తెలంగాణకు వెళ్లనిచ్చేవారా.. ఇంత పెద్ద పరిశ్రమ పెట్టనిచ్చేవారా అన్నది చర్చనీయాంశంగా మారింది.