కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా-షర్మిళ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతల మీద విమర్శలు, అందుకు ప్రతిగా షర్మిళ వాహనంపై ఆ పార్టీ నేతల దాడి.. ఆ తర్వాత నడిచిన హైడ్రామా మీడియా దృష్టిని బాగానే ఆకర్షించింది. టీఆర్ఎస్ నాయకుల దాడిలో దెబ్బ తిన్న కారును తనే స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు షర్మిళ దూసుకెళ్లడం సంచలనం రేపింది.

ఆ తర్వాత అరస్టయి బెయిల్ మీద బయటికి వచ్చిన షర్మిళ.. మరుసటి రోజు గవర్నర్ తమిళిసైను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనపై జరిగిన దాడికి తోడు మరికొన్ని విషయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసి బయటికి వచ్చిన అనంతరం షర్మిళ మీడియాతో మాట్లాడారు. తనను ఆంధ్రా అమ్మాయిగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగానే స్పందించారు.

తనది ఆంధ్రా అయితే.. కేటీఆర్ భార్యది మాత్రం ఆంధ్రా కాదా అని షర్మిళ ప్రశ్నించింది. తన గతం, తన భవిష్యత్ తెలంగాణలోనే అంటూ ఆమె పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ‘‘అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? ఏమీ లేని మీకు వందల కోట్లు ఎలా వచ్చాయి? ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ధైర్యం లేదు. మమ్మల్నేమో ఆంధ్రా వాళ్లని మాట్లాడుతున్నారు. కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆయన భార్యను గౌరవించినపుడు నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చాను.

నా గతం ఇక్కడే. భవిష్యత్ కూడా ఇక్కడే’’ అని షర్మిళ పేర్కొంది. తనను అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని అనుకుంటున్నారని.. కానీ అలా జరగదని.. రేపు మళ్లీ పాదయాత్రను మొదలుపెడుతున్నానని.. తమ మీద దాడికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని.. తనకు, తన మనుషులకు ఏం జరిగినా బాధ్యత కేసీఆర్‌దే అని షర్మిళ స్పష్టం చేసింది.