వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు అద్దాలు ధ్వంసం చేయడం, బస్సుకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక, కారులో షర్మిల కూర్చొని ఉండగానే ఆమె కారును క్రేన్ సాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆ తర్వాత ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం తెలంగాణలో రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసైకి షర్మిల తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల…గత 2 రోజులుగా జరిగిన ఘటనలను గవర్నర్ కు వివరించానని అన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకున్నా తనను అరెస్ట్ చేశారని, వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారని ప్రశ్నించారు.
తాను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమీ అనలేదని అన్నారు. అయినా, ఆయన మగతనంతో నాకేం పని అంటూ షర్మిల సంచలన కామెంట్లు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తుంది, నాకేమి అవసరం అంటూ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అంటే దానికి బదులుగా తాను చెప్పుతో కొడతా అని దీటుగా జవాబిచ్చానని చెప్పారు. ఆయనంటే తప్పు లేదని, తానన్న మాటే తప్పా అని ప్రశ్నించారు. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని, తాను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇదేనా మహిళలకున్న గౌరవం అని నిలదీశారు. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అని, తాను కేసు పెడితేనే తీసుకోవడం లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ నేతలపై సంచలన విమర్శలు గుప్పించిన షర్మిల…టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, దేశంలో కేసీఆర్ ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అని ఆరోపించారు.
తెలంగాణలో తాలిబన్ల మాదిరి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, టీఆర్ఎస్ వారంతా తాలిబన్లని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ విమర్శించారు.