కేసీఆర్ కుమార్తె క‌విత దొరికి పోయినట్టేనా?

ఢిల్లీ ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న మ‌ద్యం విధానం(లిక్క‌ర్ స్కీం)లో భారీ ఎత్తున కుంభ‌కోణం జ‌రిగింద‌నే విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీనిపై సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు సైతం ఏక‌కాలంలో కేసులు న‌మోదు చేశారు. ఇది ఒక‌వైపు తెలుగు రాష్ట్రాల‌కు కూడా పాకింది. ఇక్క‌డి అధికార పార్టీ నాయ‌కుల ప్ర‌మేయం కూడా ఉంద‌ని ఈడీ అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ కేసుల‌కు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత పేరు ఇప్పుడు ఈడీ త‌న రిపోర్టులో చేర్చింది. అదేవిధంగా ఏపీకి చెందిన వైసీపీ నాయ‌కుడు, ఒంగోలు పార్ల‌మెంటుస‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును కూడా ఈడీ ఈ జాబితాలో చేర్చింది. వాస్త‌వానికి ఈ స్కాం వెలుగు చూసిన నాటి నుంచి అంటే.. దాదాపు రెండు మాసాలుగా వీరి పేర్లు మీడియాలో వ‌స్తూనేఉన్నాయి. బీజేపీ నాయ‌కులు ఏకంగా క‌విత ప్ర‌స్తావ‌న చేయ‌డంతో ఢిల్లీకి చెందిన ఆ నేత‌ల‌పై క‌విత ప‌రువునష్టం దావా కూడా వేశారు. త‌న‌కు ప్ర‌మేయం లేద‌న్నారు.

ఇక‌, ఎంపీ మాగుంట కూడామీడియా ముందుకు వ‌చ్చి.. తాను వ్యాపారం చేస్తున్న‌మాట నిజ‌మే అయినా.. త‌న‌కు ఈ స్కాంకు సంబంధం లేద‌ని తెగేసి చెప్పారు. అంతేకాదు.. కొన్ని సోషల్ మీడియాలు త‌న పేరును వాడుకుని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని.. వాటిపై కేసులు వేస్తాన‌ని నెల కొంద‌ట హెచ్చ‌రించారు. అయితే, తాజాగా ఈ స్కాంలో ఈ ఇద్ద‌రి పేర్ల‌ను ఈడీ చేర్చింది. ఈ కేసులో నిందితుడిగా అమిత్ అరోరా అనే వ్య‌క్తికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ క‌విత పేరును మాగుంట పేరును ప్ర‌స్తావంచింది.

ఈ ఇద్ద‌రు నాయ‌కుల్లో క‌విత పేరును ప్ర‌ముఖంగా పేర్కొన్న ఈడీ దాదాపు 100 కోట్ల రూపాయ‌ల‌ను స‌మ‌కూర్చే బాధ్య‌త‌ను క‌విత భుజాన వేసుకున్నార‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది. రిమాండ్ రిపోర్టులో ఏకంగా 3 చోట్ల ఆమె పేరును పేర్కొంది. అంతేకాదు.. ఈ కేసులో క‌విత ఏకంగా 170 మొబ‌ల్ ఫోన్ల‌ను వినియోగించార‌ని, వీటిలో 10 ఫోన్లు క‌విత పేరుతో నే ఉన్నాయ‌ని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూపును శ‌ర‌త్ చంద్రారెడ్డి, క‌విత నియంత్రించార‌ని, 100 కోట్ల‌ను కూడా స‌మ‌కూర్చార‌ని పేర్కొంది.

ఇక‌, మాగుంట విష‌యానికి వ‌స్తే.. ప్ర‌దాన నిందితుల్లో ఒక‌రైన అమిత్ అరోరాతో మాగుంట ప‌దే ప‌దే ఫోన్లు మాట్లాడార‌ని, వాట్సాప్ చాటింగులు సైతం చేశార‌ని తెలిపింది. ఈ రిపోర్టుకు ఆయా ఆధారాల‌ను జ‌త చేసింది.