ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ స్వయానా తల్లి. కొన్ని నెలల ముందు వరకు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. పది సంవత్సరాలకు పైగా ఆమె ఆ హోదాలో ఉన్నారు. వైకాపా తరఫున ఆమె ఎంపీగా పోటీ చేశారు. కొన్నేళ్ల పాటు ఆమె రాజకీయం ఏపీలోనే సాగింది. గత ఎన్నికలకు ముందు ఆమె జగన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో, జగన్‌మోహన్‌రెడ్డితో మనకెందుకమ్మా అంటూ మీడియా ముందు మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది.
కొన్ని నెలల కిందటే వైకాపా గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణలో షర్మిళ పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం పని చేస్తున్న ఆమె.. తాజాగా తన కూతురి అరెస్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలో దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా… ఎంతైనా సోదరి కదా? అని ఓ మీడియా ప్రతినిధి విజయమ్మను ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ, ”ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఓ అన్నగా జగన్ మోహన్ రెడ్డి ఏమన్నాడు? అంటూ ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించగా, విజయమ్మ మళ్లీ అదే సమాధానం చెప్పారు. కాగా, తాజా పరిణామాలపై షర్మిల తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు. తనను షర్మిల వద్దకు పోనివ్వడం లేదు కాబట్టి నిరాహార దీక్షకు దిగానని తెలిపారు.