తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. తన ప్రసంగంలో పదే పదే సజ్జల పేరును పలికారు. ఆయన డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇప్పటం కూల్చివేతలు జరిగాయని వ్యాఖ్యానించారు. సజ్జల అంటే తనకు గౌరవం ఉందని, ఆయన సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారని అన్నారు.
అయితే.. తాజాగా పవన్ చేసిన కామెంట్లపై సజ్జల స్పందించారు. నన్ను రెండు మూడు సార్లు విమర్శించాడు. సరే, ముందు ఆయన పార్టీని ఆయన బాగు చేసుకోమనండి. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రజల మధ్యకు రావొచ్చు, పార్టీ పెట్టొచ్చు. ఓట్ల కోసం ప్రజలను కలుసుకోవచ్చు. దీనికి ఎవరూ అడ్డు చెప్పరు. నామీద పడడం ఎందుకు? నిజానికి ఆయన కు రాజకీయ వ్యూహం ఉందా? కొన్ని రోజులు టీడీపీ అంటాడు, మరికొన్ని రోజులు బీజేపీ, సీపీఐ, సీపీఎం , బీఎస్పీ అంటాడు. ఆయనకు లేని క్లారిటీ.. మనకెందుకు అని వ్యాఖ్యానించారు.
వైసీపీ కోటను బద్దలు కొడతానని అన్నాడు. ముందు.. ఆయన గెలవమనండి. ఒక్క సీటు కూడా లేని వ్యక్తి 151 సీట్లున్న జగన్‌ను ఢీ కొట్టి.. కోట కూలుస్తాడా? ఇదంతా స్క్రిప్టులో భాగం. స్క్రిప్టులో ఎవరో నా పేరు కూడా రాశారు. అందుకే నా పేరు కూడా వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే.. పవన్... జగన్‌ను చూసి నేర్చుకోవాలి. జగన్ ఎలా రాజకీయ నేతగా ఎదిగాడు? ప్రజల మధ్యకు ఎలా వెళ్లాడు. వారి అబిమానం ఎలా సంపాయించుకున్నాడు? అనే విషయాలు.. కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. ముందు అవి చూడాలి అని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ పదిరోజులకో, నెలకోసారి వలస పక్షిలా రాష్ట్రానికి వచ్చి పోతున్నారన్న సజ్జల… ఒక్క సీటు లేని పవన్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన ప్రభుత్వమని కూల్చడం.. పేర్చడం ఎవరిచేతుల్లోనూ లేదని.. ప్రజల చేతుల్లోనే ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ .. ఎవరితోనో చేతులు కలిపి.. మాపై పడి.. 2019లో ఏం చేశారో.. వచ్చే ఎన్నికల్లోనూ అంతేనని చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates