ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా కార్యకర్తలను, నేతలను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే… దీనిపై వైసీపీ నాయకులు అబ్బే ఇప్పుడేం లేవు.. అంటూ కామెంట్లు చేస్తున్న విషయం కూడా తరచుగా చర్చకు వస్తోంది. అయితే, వైసీపీ అధినేత జగన్ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు వంటివి గమనిస్తే మాత్రం రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా దీనికి బలాన్ని చేకూరుస్తూ.. సీఎం జగన్‌కు అత్యంత ఆప్తుడు, డాక్టర్, మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, దీనికి టైం కూడా రెడీ అవుతోంద ని తెలిపారు. అంతేకాదు.. పార్టీలో నాయకులు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎవరూ కూడా అలసత్వంతో ఉండొద్దని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉండాలని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన క్యాంపు కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అందరూ దానికి సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలే పార్టీని ముందుకు నడిపిస్తున్నాయని మంత్రి సీదిరి పేర్కొన్నారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామని పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆయన తెలిపారు.
కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా ఏం చేయలేరని, పత్రికలను చదివి మైండ్ పోగొట్టుకోవద్దని, ప్రతిపక్షాల మాటలు విని మనసు ఖరాబు చేసుకోవద్దని ఆయన హితోపదేశం చేశారు. అయితే, మంత్రి సీదిరి చేసిన ఈ ముందస్తు వ్యాఖ్యలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వారించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది సీఎం జగన్ ఇష్టమని ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే జరుగుతాయని చెప్పారు.