పదవుల పంపకం విషయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఒకేసమయంలో దాదాపు ఆరు పదవులకు సంబంధించి అంశం కావటంతో.. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక్కోపదవికి సరాసరిన నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో.. ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు మంత్రి పదవులతో పాటు నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
వ్యూహాత్మకంగా తనకు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపిన జగన్.. ఏకంగా నాలుగు పదవులకు కొత్త వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీకే చెందనున్నాయి. మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీల కంటే గవర్నర్ కోటా మీదనే అందరి చూపులు ఉన్నాయి.
ఇప్పటికే ఈ రెండుస్థానాల్లో ఒకటి మర్రి రాజశేఖర్ కు పక్కా అన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మాటతో పోటీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ఆయనకు బెర్తు పక్కా అని చెబుతున్నారు. ఇక.. మరో స్థానానికి మాత్రం అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకు రావటం గమనార్హం.
కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ సతీమణి జకియా ఖాన్ కు దక్కే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఆమెకంటే కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజుకే దక్కుతాయన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఖాయంగా పదవి దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates