వివేకా హ‌త్య కేసులో జగన్ కు షాక్

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌ను సుప్రీం కోర్టు తెలంగాణ సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు బ‌దిలీ చేసింది. వివేకా కుమార్తె.. డాక్ట‌ర్ సునీత అభ్య‌ర్థ‌న‌.. ఏపీ ప్ర‌భుత్వ అంగీకారం నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను తెలంగాణ‌లోని కోర్టుకు బ‌దిలీ చేస్తున్నామ‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువ‌రించిం ది.

దీని ప్ర‌కారం.. వివేకా కేసులో నిందితులు ఎవ‌రు ఉన్న‌ప్ప‌టికీ, హైద‌రాబాద్ కోర్టులోనే విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ఈ కేసులో అభ్యంత‌రాలు ఉన్నా.. ఇంప్లీడ్ అవ్వాల‌ని ఎవ‌రైనా అనుకున్నా హైద‌రాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా.. న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానిస్తూ.. కేసు విచార‌ణ‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే హైద‌రాబాద్‌కు బ‌దిలీ చేస్తున్నామ‌ని చెప్పారు.

త‌న తండ్రి వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వాస్త‌వానికి ఈ పిటిషన్‌పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది.

ప్రాథమిక హక్కులను పరిగణన‌లోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది.