నిజ‌మే క‌దా.. ఈ విష‌యాన్ని ప‌వన్ చెప్పాలేమో..!

కొన్ని కొన్ని విష‌యాల‌ను రాజ‌కీయ నేత‌లు స్కిప్ చేసేందుకు వీలు కాదు. ఇప్పుడు కాక‌పోతే..రేప‌యినా.. వారు వాటిని ప్ర‌స్తావించాలి.. నిజాలు ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు కూడా వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఎలాగంటే.. ఇప్పుడు అసలు.. ఆయ‌న చేతిలో ఉన్న నాయ‌కులు ఎంత‌మంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు బెల్ మోగితే.. ప‌వ‌న్ ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకు ఈ చ‌ర్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించు కుంటామ‌ని.. అధికారంలోకి వ‌చ్చి.. వైసీపీ నేత‌ల తాట తీస్తామ‌ని, అప్ప‌టికి జీరోల‌య్యే ఇప్ప‌టి వైసీపీ హీరోల‌ను త‌రిమి త‌రిమి కొడ‌తామ‌ని అన్నారు. ఓకే.. ఒక నాయ‌కుడిగా.. పార్టీ అధినేత‌గా ఆమాత్రం ప‌వ‌ర్ చూపిం చాల్సిందే.. ఆ మాత్రం కామెంట్లు కుమ్మ‌రించాల్సిందే. అయితే.. అధికారం చేప‌ట్టాలంటే.. మాత్రం మాట‌లు చెప్పినంత ఈజీకాదు క‌దా!

ఇప్పుడు ఇదే విష‌యం పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేస్తున్నారు. “ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే.. నాకు టికెట్ ఇస్తారా ప‌వ‌న్ స‌ర్‌” అని కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు.. నేను గెలిచే ఛాన్స్ ఉంది.. ట్రై చేయొచ్చా! అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అంటే.. పార్టీపై న‌మ్మ‌కం గురించి ప‌క్క‌న పెడితే..రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 తీసేసినా.. 75 స్థానాల్లో అయినా.. ప‌వ‌న్ అభ్య‌ర్థులు ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌.

ఇదిలేదు. దాదాపు 100 కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌కు అభ్య‌ర్థులు లేరు. ఇక‌, మిగిలిన 75 నియోజక వ‌ర్గాల్లో ఉన్న‌ వారిలో స‌త్తా చూపించేవారు 10 నుంచి 15 మంది లోపే. మిగిలిన వారు.. కేవ‌లం నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారే. ఒక్క ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో మాత్రం ఒకింత ఊపు ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 15 మంది నాయ‌కులు ఉండొచ్చు. అంత‌కుమించి.. ఇత‌ర జిల్లాల ప‌రిస్థితి ఒక‌టి అర‌గానే ఉంది. మ‌రి ఇలాంటివారిని పెట్టుకుని ప‌వ‌న్‌.. అధికారంలోకి వ‌స్తారా? అనేది ప్ర‌శ్న‌. అందుకే ఏవేవో చెప్పే బ‌దులు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తే.. బెట‌ర్ క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.