ష‌ర్మిల‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రీజ‌న్ ఇదే!

Sharmila

ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌లో ఉన్న ఆమెను అరెస్టు చేయ‌డంతో దీనిని నిర‌సిస్తూ.. ఆమె పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. త‌న‌ను అరెస్టు చేయ‌డంపై ష‌ర్మిల ఫైర్ అయ్యారు. త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని వ్యాఖ్యానించారు. ‘‘మా పాదయాత్రకు అనుమతి ఉంది. బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్‌ చేయకుండా.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు. కాగా, సోమ‌వారం ఉద‌యం ఆమె పాద‌యాత్ర ప్రారంబించిన స‌మ‌యం నుంచి న‌ర్సంపేట ఎమ్మెల్యే అనుచ‌రులు అడుగ‌డుగునా ఆటంకాలు సృష్టించారు. ఆమె పాదయాత్ర స‌మ‌యంలో విశ్రాంతి తీసుకునే కార్వాన్(బ‌స్సు)కు నిప్పంటించి త‌గ‌ల బెట్టారు. దీంతో తీవ్ర‌స్తాయిలో ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ముందు జాగ్ర‌త్త‌గా ఆమెను అరెస్టు చేశామ‌ని పోలీసులు చెబుతున్నారు.

ష‌ర్మిల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇవే..

నర్సంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయ‌కుడు పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్‌రెడ్డి ఆయన భార్య సైతం ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని అన్నారు. ఉద్యమకారుడిగా ఉండి.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని అన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే అనుచరుల కన్నుపడితే భూమి మాయమవుతుందన్నారు. చివరికి లే ఔట్ల్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ను వదలడం లేదని పేర్కొన్నారు. ఆయనకు సంపాదన తప్ప మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రుకాల్చి వాతపెట్టాలని త‌న పాద‌యాత్ర‌లో ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే తీవ్ర అల‌జ‌డి చోటు చేసుకుంది.