సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులను ప్రజలు ఆపేయాలని చెప్పితే.. వెంటనే నిలుపుదల చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న పెద్ద రెల్లివీధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే… జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమన్నారు.
ఎన్నికల సమయం కాకపోయినా.. ప్రజా సమస్యలు తెలిసుకునేందుకే గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. దేశమంతా నిత్యావసర రేట్లు ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పులు చేస్తున్నామని పెద్దగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అప్పులు చేయలేదా? ఆయనేమన్నీ నీతిమంతుడా? ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పుల కోసం ఎదురు చూస్తోంది. ఇదేం తప్పుకాదు
అని ధర్మాన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, “అప్పులు చేస్తున్నామని గోల పెడుతున్న చంద్రబాబు, అచ్చన్నాయుడు వంటివారు తమ ప్రబుత్వంలో అనేక మందికి అప్పులు పెట్టిపోయారు. బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మేం అధికారంలోకి వచ్చాక.. వాటన్నింటినీ తీరుస్తున్నాం. రైతులకు ఇస్తానన్న సబ్సిడీ నిదులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయిన చంద్రబాబు, అచ్చన్నాయుడు, యనమల వంటివారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. వీరు చెబుతున్న మాటలు వింటే నాకే అసహ్యం వేస్తోంది.
నేను చాలా సౌమ్యంగా ఆలోచిస్తాను. కానీ, ఇలాంటివారు ఉన్నారా? అని అనిపించేలా ఇప్పుడు బాధపడుతున్నారు. ఏం ఫర్వాలేదు.. మీకు డబ్బులు వద్దంటే నేనే స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌కు చెబుతాను. సంక్షేమ పథకాలు ఆపేయాలని సూచిస్తాను. తర్వాత మీరు అరిచి గీపెట్టినా.. ఒక్కరూపాయి కూడా రాదు. మీరే తేల్చుకోండి!“ అని ధర్మాన స్పష్టం చేశారు.