కేసీఆర్ స‌ర్ విన్నారా.. కామ్రెడ్లు కండిష‌న్ పెట్టేశారు!

ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, విజ‌యంలో భాగ‌స్వామ్యమైన కామ్రెడ్లు.. తాజాగా సీఎం కేసీఆర్‌కు కొన్ని కండిష‌న్లు పెట్టారు. ఈ కండిష‌న్ల‌కు ఒప్పుకొంటేనే.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని తేల్చి చెప్పారు. మ‌రి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇంత‌కీ కామ్రెడ్‌.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు ఏమ‌న్నారంటే.. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తామని.. అయితే అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం ఇలాగే కొనసాగితే తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు హత్యను సీపీఐ ఖండిస్తోందని కూనంనేని పేర్కొన్నారు. అటవీ సిబ్బందికి తుపాకులివ్వడం అనే డిమాండ్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు. దీనిని బ‌ట్టే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌, ఐటీ, ఈడీ దాడులతో దేశంలో విపక్షాలను మోడీ సర్కార్‌ బెదిరిస్తోందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో 3వేల ఈడీ దాడులు జరిగితే.. బీజేపీ నేతలపై ఎన్ని జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదేనా అని నిలదీశారు. ప్రధాని మోడీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని సాంబశివరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన సమయంలోనూ ఇలా లేదన్నారు.

ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, జ్యుడీషియరీ ఉపయోగించి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూనంనేని ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్లలో 3 వేల పైచిలుకు ఈడీ దాడులు చేశారని.. విపక్ష నేతలను లొంగదీసుకునేందుకే ఈ దాడులని ఆక్షేపించారు. చట్టాలు తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని.. పోసాని కృష్ణమురళికి నకలు అని ఎద్దేవా చేశారు.