ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను మద్రాస్‌హైకోర్టు కు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. 2020, జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనేక కీలక కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. దీంతో నిత్యం ఆయన విషయం పత్రికల్లోనూ రాజకీయంగా కూడా చర్చకు వచ్చేది. అయితే, తాజాగా ఈయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీచేయాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది. ఇది లాంఛనమే కాబట్టి.. న్యాయ శాఖ కూడా దీనికి అనుమతి జారీ చేయడం ఖాయం.
ఇక, జస్టిస్ దేవానంద్.. ఏపీ హైకోర్టులో రెండు సంవత్సరాల 10 మాసాలకు పైగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వ తీరుపై అనేక కేసుల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో పలువురు ఉన్నత స్థాయి అధికారులను కూడా కోర్టుకు పిలిపించి.. వివరణలు కోరిన సందర్భాలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈయన ఇచ్చిన చాలా తీర్పులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జస్టిస్ బట్టు దేవానంద్ ఆయా కేసుల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశీలిద్దాం..
- వైసీపీ ప్రభుత్వం పంచాయతీ, పాఠశాలల భవనాలకు.. ఆ పార్టీ రంగులు వేయడాన్ని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏకంగా అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోర్టుకు పిలిచి వివరణ కోరారు.
- విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు నిర్బంధించిన కేసులో టీడీపీ నాయకురాలు వంగల పూడి అనిత రాసిన లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఏకంగా విశాఖ పోలీసు కమిషనర్‌ను కోర్టుకు పిలిచారు.
- 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి 41ఏ కింద నోటీసులు జారీ చేయకపోవడాన్ని అనేక సందర్భాల్లోతప్పుబట్టారు. ఈ క్రమంలోనే అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ను కోర్టుకు పిలిచి.. పోలీసు మాన్యువల్ అంటే ఏంటో వివరించాలని ఆదేశించారు. ఇది కూడా రాష్ట్రంలోను పోలీసు శాఖలోనూ చర్చకువచ్చింది.
- సోషల్ మీడియాలో జడ్జిలు, న్యాయవ్యవస్థపైతీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపైనా.. ఆ పార్టీ సోషల్ మీడియాపై జస్టిస్ దేవానంద్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రంకపనలు పుట్టించాయి. ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన అన్నారు.
- కోర్టుకు వెలుపుల ఇటీవల ఆయన రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించారు. తన కుమార్తె ఢిల్లీలో చదువుతున్నదని, మీ రాజధాని ఏది ? అని ఆమెను ఆటపట్టిస్తుండడంతో పాటు వేధింపులకు కూడా గురి చేస్తున్నారు. ఇదీ.. ఏపీ దుస్థితి అని వ్యాఖ్యానించారు.
- స్థానిక ఎన్నికల సమయంలోను, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఓటర్ల విషయంలో వలంటీర్లు దూకుడుగా ప్రవర్తిస్తున్నారన్న పిటిషన్లపై అప్పటికప్పుడు విచారణకు స్వీకరించి.. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు.
ఇలా.. అనేక కీలక కేసుల్లో జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యలు, తీర్పులు.. అప్పట్లో సంచలనం సృష్టించడం గమనార్హం.