ఎమ్మెల్యే ఎన్నిక‌లు.. టీడీపీకి న‌కిలీ ఓట‌ర్ల భ‌యం..!

త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. సీమ ప్రాంతంలో ఉపాధ్యాయ ఎన్నిక‌లు, గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధ‌మైంది. ఈ ఎన్నిక‌ల‌ను అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. త‌మ పాల‌న‌కు ఇది గీటు రాయి అని భావిస్తున్న వైసీపీ నాయ‌కులు.. ఈ ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు దారుల‌ను గెలిపించాల‌ని చూస్తోంది.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అయితే.. వైసీపీపై ప‌ట్టు పెంచుకునేందుకు ఈ ఎన్నిక‌ల‌ను వాడుకునేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. అందుకే.. ఆచి అడుగులు వేస్తోంది. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ఉపాధ్యాయ‌, గ్రాడ్యుయేట్ వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకుంటోంది. బాల‌కృష్ణ వంటివారు కూడా ఇప్ప‌టికే పిలుపు కూడా ఇచ్చారు. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని.. వైసీపీని అంతం చేసే క్ర‌మంలో ఇది తొలి అడుగ‌ని ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ ఇరు పార్టీల విష‌యం ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై టీడీపీలో భ‌యం బ‌య‌లు దేరింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు నిత్యం వంద‌ల సంఖ్య‌లో ఓట‌ర్లు న‌మోదు చేసుకుంటున్నారు. ఇది వాస్త‌వ‌మే అయితే అభ్యంత‌రం లేదు. కానీ, ఎలాంటి అర్హ‌త‌లు లేనివారికి కూడా కొంద‌రు అధికారులు ఓటు హ‌క్కు ఇస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

వాస్త‌వంలో చూసినా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. లెక్క‌కు మిక్కిలిగా ఓట‌ర్లు పెరుగుతుండ‌డం. వారికి ఉన్న అర్హ‌త‌ల‌కు.. ఓటు హ‌క్కుకు సంబంధం లేకుండా పోవ‌డం వంటివి టీడీపీలో గుబులు రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీకి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నాయ‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాల‌కు సైతం సిద్ధ‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.