ఏపీ సీఎం జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను విశ్వసించడం లేదా? తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వైసీపీ ఎమ్మెల్యేలు సమర్ధవంతంగా తిప్పి కొట్టడం లేదని ఆయన భావిస్తున్నారా? అంటే, తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి సమయం చాలా ఎక్కువగానే ఉంది. దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే, ఈలోగానే అధికార పార్టీ అధినేత ఎన్నికలపై దృష్టి పెట్టేశారు.
నిజానికి ప్రతిపక్షాలు ఇలా దూకుడు ప్రదర్శించి ఎన్నికల ప్రచారం ప్రారంభించాయంటే అర్థం ఉంది ఉంటుంది. కానీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా ఏడాదిన్నర సమయం ఉండగానే ఫక్తు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం వెనుక వ్యూహం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఏడాదిన్నర ముందుగానే ప్రజల మధ్యకు జగన్ పంపుతున్నారు. గడపగగడపకు వెళ్లకపోతే టికెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు.
అంతే, తన పార్టీ ఎమ్మెల్యేలను తాను నమ్మడం లేదు. ప్రజలు కూడా నమ్మడం లేదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చే ముందస్తుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక, తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తానే సొంతంగా కౌంటర్లు ఇస్తున్నారు జగన్. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన నరసాపురంలో సభలో చంద్రబాబును , పవన్ కళ్యాణ్‌ను మూకుమ్మడిగా విమర్శించారు. తనపై చేసిన విమర్శల నేపథ్యంలో వాటికి కౌంటర్‌గా వ్యాఖ్యలు చేశారు.
ఇక, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన నరసన్న పేట సభలోనూ జగన్ చంద్రబాబు, పవన్ కేంద్రంగా విమర్శలు గుప్పించారు. ‘ఇదేం ఖర్మరా బాబూ’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలు చూస్తే, తనే రంగంలోకి దిగకపోతే వ్యూహం చేయిదాటే పరిస్థితిఉంటుందని జగన్ భావిస్తున్నట్టుగానే భావించాలి. మరోవైపు.. జగన్ పాల్గొంటున్న సభల ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు పెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నల్ల చున్నీలు వేసుకుని వచ్చిన మహిళలను అవమానించారని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయినా.. జగన్ లెక్కచేయడం లేదు. దీనికి కారణం.. ఎవరైనా ఆయనను వచ్చి ప్రశ్నించినా.. నల్ల జెండాలు చూపించినా.. లేక రాయి విసిరినా.. దానికి సమాధానం చెప్పుకోవడం అత్యంత ఇబ్బంది. పైగా వైరల్ అవుతుంది. దీనిని ఎదుర్కొనడం, ఇప్పటి వరకు సంపాయించుకున్న పరపతిని నష్టపోవడం కంటే బారికేడ్లే బెటర్ అనే తెగువ చూపడం గమనార్హం. ఎలా చూసుకున్నా జగన్ ఎన్నికల వ్యూహానికి బాగానే కష్టపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.