వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో దాదాపు చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభమైంది. వాస్తవానికి గత ఏడాది ట్రయల్ రన్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కొందరికి హక్కు పత్రాలు మంజూరు చేశారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నామని తెలిపారు. 17 వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నామన్నారు. “రెండేళ్ల కిందట గొప్ప కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది” అని సీఎం జగన్ తెలిపారు.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్
వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే ఉన్నాయి. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తామని తెలిపారు. ప్రతి కమతానికీ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తామన్నారు.
1000 కోట్లతో ..
దేశంలో ఎక్కడాలేని విధంగా చేస్తున్న ఈ సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించారు. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తారు. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నామని సీఎం జగన్ తెలిపారు. లంచాలకు ఎక్కడా తావులేదని పేర్కొన్నారు.