వచ్చే ఎన్నికల్లో పవన్‌కు ఎవరు సాయం చేస్తారు? ఆయనకు బీజేపీ అండగా ఉందా? టీడీపీతో చేతులు కలుపుతారా? అనే విషయాలు తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీని తీసుకున్నా.. టీడీపీని తీసుకున్నా.. ఆయా పార్టీల లబ్ధినే అవి కోరుకుంటాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బీజేపీ అయితే, పవన్‌ను అడ్డు పెట్టుకుని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని ప్రయత్నిస్తోంది.
ఇక, టీడీపీకి పవన్ బలం అవసరం లేదు. అయితే, వైసీపీ నుంచి ఎదురయ్యే వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు, బలాన్నిపెంచుకునే దిశగా చేపట్టే కార్యక్రమాలకు పవన్ అవసరం. ఇక, ఈ రెండు పార్టీలతోనూ పవన్‌కు ఎంత మేరకు అవసరం అంటే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్‌కు బలం చేకూరాలంటే, ఖచ్చితంగా ఆయన కుటుంబం బయటకు రావాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంలో ఒక్క నాగబాబు మాత్రమే బయటకు వస్తున్నారు. వచ్చారు కూడా. కానీ, మిగిలిన కుటుంబం మాత్రం పైపైకి హింట్లు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ గెలవాలనేది ఈ కుటుంబం లక్ష్యం. తాజాగా చిరంజీవి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పవన్‌ను ఉన్నతస్థానంలో చూడాలని ఉందన్నట్టు వ్యాఖ్యానించారు. మంచిదే సొంత సోదరుడు కాబట్టి, ఆ మాత్రం వాత్సల్యం ఉంటుంది.
అయితే, ఈ వాత్సల్యం కోరిక, వంటివాటిని ఖచ్చితంగా ఆచరణలో చూపిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కేవలం మాటలకే పరిమితం అయితే, ప్రయోజనం లేదని ఎన్నికలకు కనీసం ఏడాది ముందు ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి చిరు కుటుంబం ఎలా ముందుకు వస్తుందో చూడాలి.