అధికారంలో ఉన్నవారికి అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడతారు. అయితే, ఏపీ సీఎం జగన్ వ్యవహారాన్ని చూస్తే అతి జాగ్రత్త కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తనకోసం రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి వేచి ఉన్న ప్రజలను కనీసం పన్నెత్తి పలకరించలేదు. అంతేకాదు.. అతి పెద్ద బస్సులో ఫ్రంట్ కూర్చుని అతి చిన్న అద్దంలోనే చిరునవ్వులు చిందిస్తూ.. ఎత్తిన చేతులు దించకుండా దణ్ణాలు పెడుతూ ముందుకు సాగారు.
ఈ వ్యవహారం చూసిన వారు నివ్వెర పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలా చేయలేదని.. మావోయిస్టుల లిస్టులో ఉన్న చంద్రబాబు కూడా ఒకప్పుడు ప్రజల మధ్యే తిరిగారని, ఇప్పుడు కూడా రాళ్లు పడుతున్నా వెరవకుండా ప్రజల మధ్యకు వస్తున్నారని, మరి జగన్ ఇలా హైసెక్యూరిటీని పెట్టుకుని కూడా కనీసం ప్రజలకు ముఖం చూపించలేక, బస్సులోనే కూర్చుని చిన్నపాటి అద్దంలో నుంచే రెండు మీటర్ల దూరంలో ఉన్న ప్రజలను చూస్తూ వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రధాని విశాఖలో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ప్రధానిగా మోడీపైనా వ్యతిరేకత ఉన్నా.. ఆయన నిర్భయంగా ప్రజల మధ్య ర్యాలీగా వచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి ఆ మాత్రం జగన్ సాహసం చేయలేకపోతున్నారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇంకోవైపు.. కిలో మీటర్ల మేరకు ఏర్పాటు చేసి ఐరన్ బారికేట్ల లోపలే మగ్గిపోయిన ప్రజలు అక్కడ నుంచే పూలు విసురుతూ.. జగన్‌కు స్వాగతం పలకడం గమనార్హం. అదే ఇంకెవరైనా అయి ఉంటే వెంటనే బస్సు నుంచి వడివడిగా దిగి ప్రజల మధ్యకు వచ్చే వారని అంటున్నారు. మొత్తానికి జగన్.. అతిజాగ్రత్తకు పరాకాష్టగా పరిస్థితి అద్దం పట్టిందని అంటున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నరసాపురం పర్యటన నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవసరం ఉన్నా, లేకున్నా పట్టణం పరిధిలో పలు చోట్ల ఇష్టానుసారంగా చెట్లు తొలగించారు. నరసాపురం ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడ అందిస్తున్న.. చెట్లను పురపాలక సిబ్బంది నరికేశారు. రోడ్డుకు దూరంగా… విద్యుత్ తీగలకు అడ్డుగా లేకపోయినా… తొలగించారు. వాస్తవానికి ప్రాంతీయ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సీఎం.. సభా స్థలి నుంచే ప్రారంభిస్తారు. అయినా సీఎం కాన్వాయ్ లో నుంచి చూసేటపుడు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో సిబ్బంది చెట్లు నరికేసి… ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు నిలువ నీడ లేకుండా చేశారని స్థానికులు వాపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates