జ‌గ‌న్ స‌భ‌లో మ‌హిళ‌ల‌ చున్నీలు తీయించేసిన పోలీసులు

ఏపీ సీఎం జగన్ తాజాగా న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించారు. మ‌త్స్యకార దినోత్స‌వం సంద‌ర్భంగా ఇక్క‌డ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న చేశారు. అయితే, ఈ సభలో మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్‌ వద్దే ఆపేశారు. వారి చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అంటూ పోలీసులు తమ మాటనే నెగ్గించుకున్నారు.

స్వాధీనం చేసుకున్న చున్నీలను బారికేడ్‌ల కోసం ఏర్పాటు చేసిన‌ కర్రలపై పడేశారు. వర్షం పడుతుందన్న భయంతో నల్ల గొడుగులు తెచ్చుకున్న మహిళలకు చేదు అనుభవమే మిగిలింది. గేటు వద్దే గొడుగుల్ని స్వాదీనం చేసుకున్నారు. ఇస్తేగాని లోనికి అనుమతించలేదు. దీంతో చాలామంది చేసేది లేక మహిళలు సభ వెళ్లారు. మరికొంత మంది ఇంటి ముఖం పట్టారు. ఇంతకి నల్ల రంగును చూసి పోలీసులు ఎందుకు భయపడ్డారంటే కొంత మంది జగన్‌ సభలో నిరసన వ్యక్తం చేస్తారేమోనని భయాందోళనకు గురయ్యారు.

దీంతో సీఎం సభకు హాజరుకావాలంటే తప్పనిసరిగా నల్ల చున్నీలు, ఓణీలు తీసిరావాలని పోలీసులు ఖరాఖండిగా చెప్పడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని,.. దయచేసి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. పోలీసులు కుదరదని తేల్చి చెప్పడంతో.. తప్పని పరిస్థితుల్లో చున్నీలు బారికేడ్లపై వేసి లోపలి వెళ్లారు. భద్రతా సిబ్బంది తీరుపై మహిళా ఉద్యోగులు సైతం మండిపడ్డారు.

అందుకే తీసివేయించార‌ట‌!

జగన్‌ మాట్లాడుతున్న సమయంలో నల్ల గొడుగులు, చున్నీలు పైకి ఎత్తుతారన్న ముందస్తు భయంతో స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు.