జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే మామూలుగా వుండదు మరి

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటేనే ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. ప్ర‌తిప‌క్షాలేమో.. ఆయన తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం స‌ర్ వ‌స్తున్నారంటే చాలు.. దుకాణాలు బంద్‌, ర‌హ‌దారులు బంద్‌, హోట‌ళ్లు బంద్‌, చివ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు కూడా తాళాలు వేసేస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నరసాపురం ఖాకీ వనంలా మారిందనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. బందోబస్తు కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2 వేల మంది పోలీసులను రప్పించారు. సీఎం దిగే హెలిప్యాడ్‌ నుంచి సభ వేదిక వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో జనం రోడ్డు మీదకు రాకుండా తెరలు కట్టారు. కీల‌క‌మైన‌ పాతబజార్‌లోని దుకాణాలన్నీ మూసివేశారు. ఈ ఆంక్షలు సీఎం వచ్చి వెళ్లే వరకు ఉంటాయని.. దుకాణాలు మూసివేయాల్సిందేనని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

జనసమీకరణ కోసం అన్ని విద్యా సంస్థల బస్సులను స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం నియోజకవర్గం నుంచే కాకుండా పాలకొల్లు, భీమవరం, తణుకు నుంచి కూడా జనాన్ని తరలించడానికి 700 బస్సులు సిద్ధం చేశారు. జనసమీకరణ బాధ్యతను వలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, గ్రామస్థాయి సిబ్బందికి అప్పగించారు. భోజనాలు, బస్సులకు ఆయిల్‌ ఇతర ఖర్చుల భారాన్ని తమపై మోపారని మండల స్థాయిు అధికారులు వాపోతున్నారు.