ఆ హత్య వెనుక డేటింగ్ యాప్

పేర్లు వినడానికి ఆహ్లాదంగా ఉన్నా డేటింగ్ యాప్స్ ప్రాణాంతకంగా తయారవుతున్నాయి. డేటింగ్స్ యాప్స్ అనర్థాలకు కూడా దారితీస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, నేరాలకు కారణమవుతున్నాయి. తొలుత సమ్మోహనం.. తర్వాత వెగటు… చివరకు నేరమన్నట్లుగా డేటింగ్స్ యాప్స్ పరిచయాలు విషాదాంతమవుతున్నాయి..

బంబుల్ తో శ్రద్ధాకు పరిచయమైన అఫ్తాబ్

ఢిల్లీలో తీవ్ర సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు….. ఒక డేటింగ్ యాప్ కు ఉన్న లింకు తర్వాత బయటపడింది. బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్ పూనావాలా… శ్రద్ధాకు పరిచయమయ్యాడు. ఇద్దరు ముంబైలో ఉండటంతో కలుసుకోవడం సులభమైంది. పెద్దలను ఎదిరించి సహజీవనం చేశారు. తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. ఢిల్లీ చేరుకున్న కొద్ది రోజులకే శ్రద్ధాను అఫ్తాబ్ అత్యంత కిరాతకంగా చంపి ముక్కలుగా నరికాడు. ఆమె శవం ఇంటి ఫ్రిజ్ లో ఉండగానే.. మరో మహిళను తీసుకొచ్చి డేటింగ్ చేశాడు. రెండో మహిళ కూడా బంబుల్ డేటింగ్ యాప్ ద్వారానే అఫ్తాబ్ కు పరిచయమైంది. అలా చాలా మంది అమ్మాయిలతో పరిచయానికి ఆఫ్తాబ్… అదే డేటింగ్ యాప్ ను వాడాడు. ఒక వ్యక్తి ఎంత మందితో పరిచయాలు పెట్టుకున్నా, చాటింగ్ చేసినా డేటింగ్ యాప్ కు సంబంధం ఉండదని ఈ ఘటన నిరూపించింది. పైగా అది అమెరికాకు చెందిన డేటింగ్ యాప్ కావడంతో బంబుల్ పై తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం లేదు. అవసరమైతే ఈ హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు సహకరిస్తామని బంబుల్ డేటింగ్ యాప్ నిర్వాహకులు చెబుతున్నారు..

డేటింగ్ యాప్స్ పక్క దారి పట్టించే అవకాశం

బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ లో ప్రేమకు వెదుక్కోవడంలో తప్పులేదు. అందులో కనిపించే సమాచారంలో వాస్తవం ఎంత, విశ్వసనీయత ఎంత అన్నది మాత్రం నిర్ధారించుకుంటే మంచిది. వినియోగదారులను పక్కదారి పట్టించే ప్రొఫెల్స్ .. ఆ డేటింగ్ యాప్స్ లో చాలానే ఉంటాయి..ఎవరనీ నమ్మాలి.. ఎవరిని నమ్మకూడదో సకాలంలో నిర్ణయించుకోకపోతే అనర్ధాలు తప్పవు. డేటింగ్ యాప్స్ లో ఉన్న సమాచారం, ఫోటోలు నిజమైనవా.. కదా… అన్నది నిర్థారించుకున్న తర్వాతే ముందుకు సాగాలి. యాప్‌ను వినియోగిస్తున్నప్పుడు మీ లావాదేవీలు, వ్యక్తిగత విషయాల్ని తేలిగ్గా పంచుకోకూడదు. అవతలి వ్యక్తులు నిజంగా ప్రేమిస్తున్నారా.. లేక స్వలాభం కోసం వాడుకుంటున్నారా అన్నది అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో శ్రద్ధా లాగే శవంగా మారే ప్రమాదం ఉంటుంది.

పాజిటివిటి కొంత వరకే మంచిది…

ప్రతీ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నామని కొందరంటుంటారు. డేటింగ్ యాప్స్ లాంటి వాటిలో అది కరెక్టు కాదు. కాస్త నెగిటివ్ గా ఆలోచించినప్పుడే అవతలి వ్యక్తుల లోపాలు తెలుస్తాయి. వాళ్లు నిజం చెబుతున్నారా లేక మోసగిస్తున్నారా అనేది అర్థమవుతుంది. సంతోషంగా మాట్లాడుతూ, ఆనందంగా గడుపుతూ ఉన్నంత మాత్రాన అవతలి వ్యక్తిలో నిజాయితీ ఉందని చెప్పలేం. అవతలి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత డేటింగ్ లో సెకెండ్ స్టెప్ దిశగా వెళ్లాలి…

సరైన డేటింగ్ యాప్ ను ఎంచుకోవాలి

యాప్ ఎంపిక కూడా చాలా ముఖ్యం. కొన్ని యాప్స్ లో మోసగాళ్లు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లు అమ్మాయిలను తొందరగా ట్రాప్ చేయగలరు. అలాంటి యాప్స్ ఏమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అబ్బాయిలు కూడా అమ్మాయిల పేర్లతో చాటింగ్ చేసే యాప్స్ ఉంటాయి . అందుకే ఎంచుకున్న మార్గంలో పక్కదారి పట్టకుండా ఉండాలంటే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రెండ్ ప్రకారం వెళ్తున్నామనుకుంటే మాత్రం భారీ ముల్యం చెల్లించుకోక తప్పదు.