ఎన్నికలంటే ఎన్నికలే. రాజకీయాలంటే రాజకీయాలే. గతంలో ఎవరో అన్నట్టుగా.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు!! ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ డిసెంబరు 1న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలుతెర మీదికి వస్తున్నాయి. వీటిలో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోందేంటంటే.. ఒకే స్తానం నుంచి రెండు పార్టీల తరపున పోటీ పడుతున్న భార్యా-భర్తలు! ఔను. నిజమే. మూడు ముళ్ల బంధంతో ఏకమైన ఇద్దరు దంపతులు రెండు పార్టీల తరఫున బరిలో నిలిచారు.
ఇది కొత్తేంకాదు.. అంటారా? నిజమే. 2019లో తండ్రి, తనయలు కూడా ఏపీలో రెండు టికెట్లపై పోటీ చేశారు. సో.. ఇక్కడ కొంచెం రివర్స్ అయి.. భార్యాభర్తలు పోటీకి దిగారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. భార్య తన ప్రచారంలో తన భర్త తాగుబోతు అని అతనికి ఓటేయొద్దని ప్రచారం చేస్తోంది. ఇక, భర్త.. మరో అడుగు ముందుకు వేసి.. తన భార్య మంచిది కాదని.. తనకు కూర కూడా సరిగా వండి పెట్టదని, ఇక, మీకేం చేస్తుందని.. కాబట్టి ఆమెను ఓడించాలని.. ఆయన ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారం వినేందుకు.. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కట్ చేస్తే.. వీరిద్దరూ కూడా నైట్ అయ్యేసరికి ఒకే ఇంటికి వెళ్లి.. ఒకే కంచంలో అన్నం లాగించేస్తున్నారు!!
ఎవరు.. ఏంటి కథ!
ప్రభాత్సింగ్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీ నుంచి 1980, 85లో రెండు సార్లు కలోల్
అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1995లో బీజేపీలోకి చేరి.. అదే నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున 1995, 1998, 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత పంచమహల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో గెలుపొందారు. అయితే తనకు ఇష్టం లేకున్నా పార్టీ అధిష్ఠానం.. 2017లో తన కోడలుకు కలోల్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో ఈ సారి తనకు టికెట్ లభించదన్న కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత గూటికి(కాంగ్రెస్) చేరారు ప్రభాత్ సింగ్.
ఇదిలావుంటే, కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని భావించిన బీజేపీ వెంటనే ప్రభాత్ సింగ్ భార్య రంగేశ్వరిబెన్ రత్వాను అభ్యర్థిగా ప్రకటించేసింది. అంటే.. కలోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున భర్త, బీజేపీ తరఫున భార్య పోటీచేస్తున్నారన్నమాట. ఇక, ఈ కుటుంబంలోని కోడలు సుమన్బెన్ చౌహాన్ అత్తకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తల పోటా పోటీ ప్రచారం జోరుగా సాగుతోంది. మరి చివరకు ప్రజలు ఎటు మొగ్గుతారో చూడాలి.