కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన చంద్రబాబుకు తొలి రోజు నుంచి వైసీపీ నేతల నుంచి అడ్డగింతలు ఎదురవుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా.. హైకోర్టు విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబుపైనా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూడో రోజు.. చివరి రోజు పర్యటనలోనూ వైసీపీ నాయకుల, కార్యకర్తలు ఆయనను అడ్డగించారు. ఏకంగా టీడీపీ ఆఫీస్ వద్దే హల్చల్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక, మూడో రోజు పర్యటనలో టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని మౌర్యా ఇన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కర్నూలు జిల్లా పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదరించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులంతా ఓ మాఫియాగా మారారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి.. ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. 50 ఫెడరేషన్లు పెట్టి ఛైర్మన్లు పెట్టారని, వారికి జీతాలు, కుర్చీలు కూడా లేవన్నారు. ఏ2 సాయిరెడ్డి విశాఖపట్నంను దోచేస్తున్నారని, విశాఖలో 50 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ తనపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మూడు రాజధానులు అవసరం లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.