రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రజల సెంటిమెంటును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నేతలు.. పన్నే వ్యూహాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తాజాగా కామెంట్లు.. అధికార పార్టీ వైసీపీలోనూ గుబులు రేపుతున్నాయి. పైకి ఏమీ అనలేక.. లోలోన దాచుకోలేక.. ప్రస్తుతం ఎదురుదాడి మంత్రాన్ని ఎంచుకున్నారు.
కర్నూలులో పర్యటిస్తున్న చంద్రబాబు.. తనకు ఇదే చివరి ఎన్నికలని, ఆఖరి ఛాన్స్ ఇవ్వాలని.. ప్రజలను అభ్యర్థించారు. అయితే.. ఈ విషయం ప్రజల మధ్య విస్తృతంగా చర్చకు వస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు వేరు.. ఈ కామెంట్ల తర్వాత చంద్రబాబు వేరు అన్నట్టుగా రాజకీయాల్లో చర్చకు వచ్చింది. ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు ఇదే తనకు చివరి ఎన్నికలని ప్రకటించలేదు.
కానీ, ఇప్పుడు ఆయన ఆఖరి ఛాన్స్ అంటూ.. సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతారని.. రాజకీయ పండితులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే.. విజన్ ఉన్న నాయకుడిగా ఆయనకు ప్రజల్లో పేరుంది. ఆయన పట్ల ఇప్పటికీ. ఒక మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన పిలుపు, చేసిన కామెంట్ వర్కవుట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ పరిణామం.. వైసీపీలోనూ గుబులు రేపుతోంది. ఎందుకంటే.. గతంలో తాము ఒక్క ఛాన్స్ అని రాజకీయంగా లబ్ధి పొందిన నేపథ్యంలో ఇప్పుడు అదే మంత్రాన్ని రివర్స్ చేసి.. లాస్ట్ ఛాన్స్ అంటూ.. చంద్రబాబు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు దీనిపై తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము గతంలోనే ఈ విషయం చెప్పామని.. ఇదే ఆఖరి ఛాన్స్ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా.. మంత్రి ముఖంలో మాత్రం ఎక్కడో భయం తొణికిసలాడుతుండడం గమనార్హం. మొత్తానికి బాబు ప్రయోగించిన సెంటిమెంటు.. వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates