దావూద్‌ జ‌గ‌న్ .. ఇంటికి పంపిస్తా! : చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. ఏ త్యాగానికైనా తాను సిద్ద‌మ‌ని, అవ‌స‌ర‌మైతే జైలుకు సైతం వెళ్లేందుకు తాను రెడీగానే ఉన్నాన‌ని అన్నారు. “ఏ జైల్లో పెడ‌తారో పెట్టండి. ఏకేసు పెడ‌తారో పెట్టండి. అన్నింటికీ సిద్ధ‌మే” అని చంద్ర‌బాబు తీవ్ర ఆవేశం వ్య‌క్తం చేశారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలిరోజు చంద్ర‌బాబు.. పత్తికొండలో భారీ రోడ్ షో, బాదుడే బాదుడు జనం సభలో ఆయన పాల్గొన్నారు.

అనంత‌రం దేవనకొండ, కోడుమూరులో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అడుగడుగునా జేజేలు పలుకుతున్న జనం కార్యకర్తలను చూసి చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడారు. అదే క్రమంలో జగన్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాస్తే.. దాడులు చేస్తారని అన్నారు. ఈ దాడులకు తెలుగుదేశం భయపడదని అన్నారు.

జైలులో పెట్టినా.. తప్పుడు కేసులు పెట్టినా వెనుకడుగు వేయబోన‌ని చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు రాస్తే… కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. సీబీసీఐడీని పంపిస్తున్నారని, దాడులు చేయిస్తున్నారని అన్నారు. చివరకు కోర్టుల్లో పని చేసే జడ్జీలను కూడా వదల్లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవమాన పరుస్తున్నారని, ఈ దావూద్ జగన్ ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

“రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. పేదలను ఆర్థిక కష్టాల్లో నెట్టేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న పరిస్థితి. ఈ జగన్‌కు పాలన చేత కాదు.. ఆయన ఒక నియంతగా మారాడు. దావూద్ ఇబ్రహీంను మించిపోయాడు. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండ‌డం మ‌న దౌర్భాగ్యం” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌కు బాబు స‌వాల్‌!

సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్ రువ్వారు. “ఈ ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ చేస్తున్నా.. రాయలసీమకు ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా?”అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా.. ప్రపంచ దేశాలు తిరిగి 18 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామ‌న్నారు. “5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 16 లక్షల కోట్లు పెట్టుబడులు పూర్తి చేసి ఉంటే.. 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. రాయలసీమలో నీళ్లు లేని ప్రాంతం అనంతపురం జిల్లాలో కియో పరిశ్రమను తెచ్చిన ఘనత టీడీపీదే” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.