అందరి చూపు విశాఖ వైపు… ఎందుకో

రాజకీయాలకు కేంద్ర బిందువు

విశాఖపట్నం రాజకీయంగా కీలక ప్రాంతం కాబోతోంది. అన్ని పార్టీలు ఇప్పుడు విశాఖ వైపే చూస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామని జగన్ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి విశాఖవైపే ఉంది. విశాఖ కేంద్రంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల జరిపిన 15 వేల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను కూడా విశాఖలో జరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. వచ్చినదీ బీజేపీ ప్రధాని అయినా… కార్యక్రమ ఏర్పాట్లన్నీ వైసీపీ నేతలే చూసుకున్నారు. జనసమీకరణ బాధ్యతను విజయసాయి రెడ్డి నెత్తిన వేసుకుని లక్షలమందిని తరలించారు. విశాఖ కోసమే అహరహం పనిచేస్తున్నట్లు వైసీపీ చెప్పుకుంటోంది..

ఉత్తరాంధ్రలో పర్మినెంట్ పాగాకు ప్రయత్నాలు

ఉత్తరాంధ్రను తమ ఖాతాలోనే ఉంచుకోవాలన్నది జగన్ ప్లాన్. వెనుకబడిన జిల్లాలు కావడంతో అభివృద్ధిపై హామీలిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అవకాశం ఉందని అధికార పార్టీ విశ్వసిస్తోంది. ఉత్తరాంధ్ర మహానగరం, ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచే ఆ ప్రాంతాన్ని శాసించే అవకాశం ఉందని కూడా భావిస్తోంది. అందుకే తిమ్మిని బొమ్మిని చేసైనా రైల్వే జోన్ తీసుకురాగలితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వైసీపీ కిందా మీదా పడుతోంది. అందుకే ప్రధాని ప్రసంగంలో జోన్ ప్రస్తావన లేకపోయినా.. స్థానిక రైల్వే అధికారులను బతిమాలుకుని… రైల్వే జోన్ కార్యాలయానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన ఇప్పించగలిగారు… అన్ని వసతులు, కార్యాలయాలు విశాఖలోనే ఉంటే.. అమరావతి రావాల్సన అవసరం ఉండదని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక భావన కలిగించేందుకు కూడా వైసీపీ ప్రయత్నిస్తోంది…

కసిసొచ్చిన పోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు

విశాఖ నగరానికి సహజంగానే కొన్ని వసతులు ఏర్పడ్డాయి.తీర నగరం కావడంతో కడలి అందాలకు తోడు, ఓడరేవు కలిసొచ్చి ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. నావికాదళ కేంద్రం కావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో విశాఖ ఒక సాఫ్ట్ వేర్ నగరంగానూ అభివృద్ధి చెందుతోంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక వాణిజ్య కేంద్రాలూ అక్కడున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నగరం విస్తరిస్తోంది. ప్రస్తుతం నగర జనాభా 20 లక్షలు దాటింది జనాభా వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఐదు శాతంగా నమోదైంది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా విశాఖ జనాభా వృద్ధి రేటు త్వరలోనే మూడు శాతానికి చేరుకోవచ్చు..

అమరావతిని దెబ్బకొట్టడమే ధ్యేయం

ఒక సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడమే సీఎం జగన్ ఏకైక లక్ష్యం. చంద్రబాబు శంకుస్థాపన చేయించిన అమరావతితో కొన్ని వర్గాలకే ప్రయోజనం కలుగుతుందని, వాళ్లు మల్టీ బిలియనీర్లుగా మారతారని జగన్ అంచనా వేశారు. దానితో అమరావతిని దెబ్బకొట్టి.. రాజధానిని వేరు ప్రాంతానికి మార్చాలని నిర్ణయించుకుని మూడు రాజధానుల మూడు ముక్కలాటకు తెరతీశారు. అందుకే విశాఖపై ఆయనకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది. పైగా జగన్ టార్గెట్ చేసుకున్న సామాజిక వర్గ ప్రాబల్యం ఉత్తరాంధ్రలో లేదు…

పవన్ కూ విశాఖ ముఖ్యమే…

నిజానికి నిన్న మొన్నటి దాకా విశాఖ ప్రాంతంలో టీడీపీ బలమైన పార్టీ. గత ఎన్నికల్లో మాత్రం మట్టి కరిచింది. అక్కడ టీడీపీని మళ్లీ బలం పుంజుకోనివ్వకుండా చూడటమే వైసీపీ శ్రేణుల ప్లాన్. మరో పక్క పవన్ కల్యాణ్ కు కూడా విశాఖ చాలా ఇంపార్టెంట్. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయినప్పటికీ ఈ సారి పరిస్తితులు తనకు అనుకూలంగా ఉంటాయని పవన్ విశ్వసిస్తున్నారు. విశాఖలో ఆయనకు ఎక్కువ మంది అభిమానులున్నాయి. ఆయన సామాజిక వర్గానికి కూడా కొంతబలముంది అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రలో పర్యటించాలని పవన్ ప్రయత్నిస్తున్నారు…మరి అందరూ ఆశలు పెట్టుకున్న మాట నిజమే కానీ… విశాఖ ప్రజానాడి ఏమిటో చూడాలి…