ఆ నేత‌ల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చేశారా…!

వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించాల‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకుల‌ను ముందుండి న‌డిపిస్తున్నారు. దీంతో పార్టీని అంటిపెట్టుకుని ఆది నుంచి ఉన్న నాయ‌కులు అంద‌రూ క‌దులుతున్నారు. వైసీపీ స‌ర్కారును నిల‌దీస్తున్నారు. అయితే.. 2017-18 మ‌ధ్య వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలోచేరిన నాయ‌కులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అప్ప‌ట్లో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరిలో కొంద‌రికి మంత్రి ప‌దువులు కూడా ఇచ్చారు చంద్ర‌బాబు. అంతేకాదు.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వారంద‌రికీ టికెట్లు కూడా ఇచ్చారు. అయితే, వారిలో ఒక్క గొట్టిపాటి ర‌వి (అద్దంకి) త‌ప్ప‌.. అంద‌రూ ఓడిపోయారు. పోనీ.. పార్టీ త‌ర‌ఫున ఏమైనా వాయిస్ వినిపిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారా ? ప్ర‌జా ఉద్యమాలు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మ‌రి ఇంత‌కీ వారు ఏం చేస్తున్నారు? అంటే.. ఎవ‌రికి వారు అంత‌ర్గ‌తంగా మ‌ద‌న ప‌డుతున్నారు.

ఏమాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చినా వారికి ప్ర‌భుత్వం నుంచి షాక్ త‌ప్ప‌ద‌నే సంకేతాలు ఇప్ప‌టికే వెళ్లాయ‌ని టీడీపీలో గుస‌గుస వినిపిస్తోంది. స‌రే.. ఎప్ప‌టి నుంచో వారు బ‌య‌ట‌కు రావ‌డం లేదు కదా.. ఇప్పుడు ఎందుకు వీరి గురించిన చ‌ర్చ వ‌చ్చిందంటే.. త్వ‌ర‌లోనే పార్టీలో నెంబ‌ర్ 2 నారా లోకేష్ పాద‌యాత్ర చేప‌డుతున్నారు. ఈయ‌న‌కు స‌హ‌క‌రించేందుకు జిల్లాల వారీగా క‌మిటీలువేస్తున్నారు. ఈ క‌మిటీల్లో జంపింగు నేత‌ల‌ను కూడా ఉంచాల‌ని చంద్ర‌బాబు భావించారు. దీనిపై తాజాగా చ‌ర్చ కూడా జ‌రిగింది.

అయితే.. ఒక‌రిద్ద‌రు నేత‌ల‌ను సంప్ర‌దించ‌గా.. వారు మౌనంగా ఉన్నారు. త‌మ‌కు ఎలాంటి బాధ్య‌త‌లు వ‌ద్ద‌ని, కావాలంటే.. కొంత ఖ‌ర్చుల‌కు స‌హ‌క‌రిస్తా మని చెప్పుకొచ్చారు. అంటే.. ప‌రోక్షంగా వారు పాద‌యాత్ర‌లో పాల్గొనేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఫైర్ అయ్యార‌ట‌. భ‌య‌ప‌డుతూ.. ఎన్నాళ్లు కూర్చుంటారు ? అని నిల‌దీసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, నేత‌లు మాత్రం ఇప్పుడు తాము బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్ర‌భుత్వం నుంచి మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని, అది టీడీపీనే ఇబ్బంది పెడుతుంద‌ని అంటున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం వ‌చ్చితీరాల‌ని హుకుం జారీ చేశార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.