‘కేసీఆర్ కాబోయే ప్ర‌ధాని’.. ‘ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్‌’

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఉద్య మ నాయ‌కుడిగా, తెలంగాణ సార‌థిగా ఢిల్లీపై కొట్టాడిన నాయ‌కుడుగా కూడా ఆయ‌న‌కు పేరుంది. ఈ క్ర‌మం లోనే తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ అంటే అభిమానం కురిపిస్తారు. అయితే, ఇప్పుడు కేసీఆర్‌కు కేవ‌లం తెలంగాణ‌లోనేకాదు.. పొరుగున ఉన్న ఏపీలోనూ అభిమానులు ఆయ‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

గ‌తంలో కేసీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు, త‌ర్వాత సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు విజ‌య‌వాడ మీదుగా ఆయ‌న తాడేప‌ల్లికి వెళ్లిన‌ప్పుడు కూడా ఇక్క‌డి వారు కేసీఆర్ ప‌ట్ల ఎంతో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఫ్లెక్సీల‌కు పాలాభిషేకాలు చేశారు. ఆయ‌న‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. త‌ర్వాత కాలంలోనూ విజ‌య‌వాడ‌లో స‌భ‌పెడతాన‌ని కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కూడా ఇంతే రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో త‌ర‌చుగా ఏపీపై కేసీఆర్ స‌హా ఆయ‌న మంత్రివ‌ర్గంలోని కొంద‌రు కామెంట్లు చేస్తుంటారు. ఇదిలావుం టే తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో ఓ అభిమాని.. ఏకంగా కేసీఆర్‌కు ప్ర‌ధాని పీఠం క‌ట్ట‌బెట్టేశారు. ఆయ‌న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గద్దె గోపాలకృష్ణమూర్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్‌ రావాలని, దేశ ప్రధానిగా కేసీఆర్‌ కావాలని కోరుతూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని దేశమంతటా ప్ర‌జ‌లు ముక్తకంఠంతో కోరుకొంటున్నారని చెప్పేందుకు ఈ ఫ్లెక్సీనే నిదర్శన‌మ‌ని.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు అప్పుడే భాష్యం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లేజాతీయ‌పార్టీ కోసం ఎన్నిక‌ల సంఘానికి పంపించిన నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీ మ‌రింత‌గా రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీయ‌డం గ‌మ‌నార్హం.