సిల్క్ స్మిత‌కు ప‌వ‌న్‌కు తేడా లేదు: మంత్రి బొత్స

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించి.. గుంక‌లాంలో ప్ర‌భుత్వం వేసిన లే అవుట్‌ను ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించా రు. జ‌గ‌న‌న్న ఇళ్ల విష‌యంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. అయితే, తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. ప‌వ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

“ఒక‌ప్పుడు సినిమాల్లో వ్యాంపు.. వ్యాంపు కారెక్ట‌ర్లు చేసిన సిల్క్ స్మిత‌కు.. ఇప్పుడు ప‌వ‌న్ కు పెద్ద‌గా తేడా ఏమీ లేదు. సిల్క్‌స్మిత జ‌నాల్లోకి వ‌చ్చినా.. ఇంత‌క‌న్నా ఎక్కువ మందే జ‌నం వ‌స్తారు. ప‌వ‌న్‌కు రావ‌డంపెద్ద గొప్ప‌కాదు. జనాలు వచ్చినంత మాత్రాన నాయకులు అవ్వరు. సినిమా వాళ్ళు వస్తే జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా పెద్ద పుడింగా? అత‌ని మీద ఢిల్లీ లో కంప్లైంట్ చేయాల్సిన అవ‌స‌రం మాకు లేదు” అని బోత్స వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ తోడు దొంగ‌లేన‌ని, వాళ్లు వాళ్లు కింద మీద ప‌డాల‌ని.. త‌మ‌పైకి వ‌స్తే.. దిమ్మ‌తిరిగే స‌మాధానం చెబుతామ‌ని వ్యాఖ్యానించారు.అదేస‌మ‌యంలో ప‌వ‌న్ గురించి మాట్లాడితే త‌న స్థాయి తగ్గుతుందని బొత్స వ్యాఖ్యానించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే శ‌క్తి, సామ‌ర్థ్యం సీన్ లాంటివి ఏవీ కూడా ప‌వ‌న్‌కు లేవ‌ని బొత్స తెలిపారు. అంత సీన్ ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు రెండోచోట్ల ప్ర‌జ‌లు త‌రిమి కొట్టారో చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు.

ఇక‌, రాష్ట్రంలో రెండవ అతిపెద్ద లేఅవుట్ విజయనగరంలోని గుంక‌లాం అని బొత్స తెలిపారు. సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కల అని, ఆ కల నిజం చేసింది ముఖ్యమంత్రి జగన్ మాత్ర‌మేన‌ని చెప్పారు. తండ్రి ఆశ‌యాలు నిజం చేస్తూ పేదలకు అండగా వుండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. సుమారు ఇరవై అయిదు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామ‌న్నారు. పేదల లాండ్ కొనుగోలుకు కోట్ల రూపాయలు ప్రభుత్వం కర్చుపెట్టిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ పార్టీ కాదు..సెలబ్రిటీ పార్టీ అని విమ‌ర్శ‌లు గుప్పించారు.