ఆ ఒక్క విష‌యంలో బాబు దూకుడు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు 126 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి త‌మ్ముళ్ల‌తో స‌మీక్ష‌లు పూర్తి చేశారు. సంఖ్యాబ‌లం బాగానే ఉంది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందుగానే ఆయ‌న స‌మీక్ష‌లు పూర్తి చేయ‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. గ‌తంలో ఎప్పుడూ కూడా ఈ రేంజ్‌లో చంద్ర‌బాబు స‌మీక్షలు చేసింది లేదు. సో.. ఇప్పుడు ఆయ‌న క్షేత్ర‌స్థాయిపై దృష్టి పెట్టారు. దీనిని అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు.

అయితే, పాడిందే పాట అన్న‌ట్టుగా చంద్ర‌బాబు త‌మ్ముళ్ల‌ను ప‌దే ప‌దే హెచ్చ‌రించారు. ప‌నిచేయ‌ని వారిని గ‌మ‌నిస్తున్నాన‌ని.. వారికి త‌గిన విధంగా లెస్స‌న్ చెబుతాన‌ని తాజాగా కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. అంటే.. ఇన్నాళ్లుగా చంద్ర‌బాబు ఇన్ని స‌మీక్ష‌లు చేసినా.. నాయ‌కుల్లో మార్పు రావ‌డం లేదేనేది స్ప‌ష్టంగా తెలుస్తున్న విష‌యం. సో.. ఇప్పుడు ఏం చేస్తారు? పార్టీని, నేత‌ల‌ను ఆయ‌న ఎలా ముందుకు న‌డిపిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌మీక్షించిన చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే తాను జిల్లాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. ఇది ఎలా ఉన్నా.. త‌మ్ముళ్ల‌ను లైన్‌లో పెట్టే విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రి మాత్రం ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. చంద్ర‌బాబు ఎంత చెబుతున్నా.. వారు వినిపించుకోక‌పోవ‌డం.. వారు చెబుతున్న‌ది చంద్ర‌బాబు ప‌ట్టించుకోక పోవ‌డం.. వంటివి రాజ‌కీయంగా టీడీపీని ప‌ట్టిపీడిస్తున్న విష‌యంగా మారిపోయింది. మ‌రికొంద‌రు నాయ‌కులు చంద్ర‌బాబు పిలుస్తున్నా రావ‌డం లేద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల అనంత‌పురం జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి స‌మీక్ష చేస్తే.. సీనియ‌ర్ నేత‌ల‌కు చంద్ర‌బాబు ఆహ్వానం పంపించారు. అయితే, ఆయన డుమ్మా కొట్టి.. త‌న కుమారుడిని మాత్ర‌మే పంపించారు. ఈ ప‌రిణామాల‌తో రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అనేది ఆస‌క్తిగా మారింది. దీనికి కార‌ణం.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు చొప్పున నాయ‌కులు పోటీ ప‌డుతున్నార‌నే ప్ర‌ధాన విష‌యంగా మారింది.

దీనికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటే అప్పుడు ప‌రిస్థితి ఏంట‌నేది కూడా నాయ‌కుల మ‌ధ్చ చ‌ర్చ‌గా మారింది. దీంతో చంద్ర‌బాబు చెబుతున్న విష‌యాల‌ను వారు పెడ‌చెవిన పెడుతున్నార‌నే గుస‌గుస జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యం తేల్చేస్తే.. చంద్ర‌బాబు హ‌వాకు తిరుగు ఉండ‌ద‌నే సంకేతాలు కూడా వ‌స్తున్నాయి.