వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు జిల్లా పరిషత్ కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య కన్నా గుడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు తగ్గాయని ఆమెను ప్రశ్నించగా 15 గుడ్లు పాడయ్యాయని, ఆ గుడ్లను బయటపడేయడంతో వాటిని కాకులు ఎత్తుకెళ్లాయని నిర్వాహకురాలు సమాధానం ఇవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డి షాక్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆమెను విధులనుంచి తొలగించాలని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశించారు. ఏదేమైనా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates