ఏపీ అధికారపక్ష నేతలే కాదు.. రాష్ట్ర ప్రజల్లోనూ ఖాళీ అయిన మంత్రుల్లో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏడాది పాలనను పూర్తి చేసుకున్న జగన్ సర్కారు.. పలు పథకాలతో ముందుకెళుతున్న వేళ.. ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఆశావాహులంతా ఎవరికి వారుగా తమ తమ ప్రయత్నాల్ని చేసుకుంటున్నారు.
మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇరువురు నేతలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావటంతో.. మంత్రి పదవులు తమకే చెందుతాయన్న ఆలోచనలో నేతలు ఉన్నారు. అయితే..లెక్కలు మరోలా ఉన్నాయి.
పిల్లి.. మోపిదేవిలు ఇద్దరు మంత్రి పదవులతో పాటు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో మొత్తం నాలుగు పదవుల్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఈ నాలుగింటిని బీసీలకే కట్టబెట్టటం కష్టమవుతుంది. అందుకే.. ఎమ్మెల్సీల్లో ఒకటి.. మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు కట్టబెట్టి మిగిలిన వాటిని ఇతరులకు కేటాయించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఒకవేళ ఎమ్మెల్సీలను బీసీలకు కట్టబెట్టని పక్షంలో.. మంత్రి పదవుల్ని వారికే కేటాయిస్తారని చెబుతున్నారు. సామాజిక సమీకరణాలన్ని మామూలు వేళల్లోనే కానీ.. బలమైన అధినేత ఉన్నప్పుడు కాదన్న ప్రాథమిక సూత్రాన్ని మరవకూడదు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన మంత్రి పదవుల్ని కచ్ఛితంగా బీసీలకే ఇవ్వాలన్న రూల్ కూడా లేదు. వేరే వారికి ఇచ్చినా మాట్లాడే పరిస్థితి లేదన్నది మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. మంత్రి పదవి రేసులో ఆరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 22న కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఆరుగురు ఆశావాహులు ఎవరన్నది చూస్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత.. ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు పేరు వినిపిస్తోంది. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అదే సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లువినిపిస్తున్నాయి. మరి.. ఈ ఆరుగురిలో అదృష్టవంతులైన ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం చెప్పగలిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates