మోడీ విజిట్‌.. వైసీపీ ప్లాన్ ఏంటి..!

Modi
Modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈనెల 11న విశాఖ‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతాకాదు. విశాఖ‌లో ఏర్పాట్ల‌ను సైతం ద‌గ్గ‌రుండిమ‌రీ చూసుకుంటున్నారు. అదే స‌మయంలో మోడీ విశాఖ‌లోని ఏయూలో పాల్గొనే బ‌హిరంగ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నాల‌ను త‌ర‌లించాల‌ని కూడా వైసీపీ నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన బాధ్య‌ల‌ను విశాఖ ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నాయ‌కులు అంద‌రూ కూడా ఇదే ప‌నిపై ఉన్నారు. అయితే.. మోడీ స‌భ ద్వారా.. వైసీపీ ఏం ఆశిస్తోంది? అస‌లు ప్లాన్ ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ మోడీ వ‌చ్చారు. అప్ప‌ట్లో 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌లిసి పాల్గొన్నారు. త‌ర్వాత‌.. రాజ‌ధాని శంకుస్థాప‌న‌ను ఆయ‌న చేతుల మీదుగానే చేయించారు. ఇక‌, ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు.. మోడీకి మ‌ధ్య వివాదాలు.. విభేదాలు చోటు చేసుకున్నాయి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో మోడీ రాక ఇది రెండోసారి. గ‌తంలో ఆయ‌న అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వ‌చ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ విశాఖ‌కు వ‌స్తున్నారు. అంటే.. మోడీని ఒకే ఏడాదిలో రెండుసార్లు రప్పించిన ఘ‌న‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వానిదేన‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే, గ‌తంలో వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌ధాని కేవ‌లం అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. దీంతో ఏపీ అభివృద్ధి గురించి ఆయ‌న మాట్లాడే అవ‌కాశం లేకుండా పోయింది.

అయితే.. ఇప్పుడు మాత్రం కేవలం అబివృద్ధి కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌కు మాత్ర‌మే మోడీ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇది త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేసుకుంటున్నారు. పైగా విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వానికి ఇది మ‌రింత మేలు చేస్తుంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో విశాఖ వేదిక‌గా.. నిర్వ‌హించే స‌భ ద్వారా ఏపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న ఏం మాట్లాడ‌తారు? అనేది కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ‌గా మారింది. ఎంత కాద‌న్నా.. అంతో ఇంతో త‌మ‌పై పాజిటివ్ జ‌ల్లులు కురిపించే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ భావిస్తోంది. మ‌రి మోడీ ఏం చేస్తారో చూడాలి.