ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వ విధానాలు ఏ మాత్రం సరిగా లేవని.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న మాట వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు మింగుడుపడనివిగా మారాయి. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కారును ఇరుకునపడేలా చేశాయంటున్నారు. అసలేం జరిగిందంటే..
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తాజాగా తన నియోజకవర్గ రైతులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు ఎదురవుతున్న సమస్యలపై ఆయనతో వారు మొరపెట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల తీరు రైతులకు ఇబ్బందులకు గురవుతున్నట్లుగా ఎమ్మెల్యే ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరును తప్పు పడుతూ.. ధాన్యం కొనుగోలు పనులను వాలంటీర్లకు అప్పజెప్పటం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పని తీరు బాగానే ఉన్నా.. అధికారులు చేస్తున్న తప్పుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరుతో పాటు.. తమపై వ్యతిరేకత వస్తుందన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. అధికార పార్టీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అనపర్తి ఎమ్మెల్యే ఒప్పుుకున్నట్లుగా ఆయన మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికారులపై సీరియస్ అయ్యే క్రమంలో ఎమ్మెల్యే నోరు జారిన వైనం ప్రభుత్వాన్ని ఇబ్బంది పడేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates