రాజకీయ పార్టీలంటే పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం.. వాటిని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించడమే చూస్తుంటాం. కానీ పార్టీ పెట్టిన వ్యక్తి కోట్ల కొద్దీ తన ఆదాయాన్ని పార్టీ ఫండ్ కింద ఇవ్వడం.. ఆ డబ్బుల్లోంచి అభాగ్యులకు సాయం చేయడానికి పెద్ద మొత్తంలో కేటాయించడం ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే జరుగుతోంది.
ఇటీవలే ఒక సమావేశంలో భాగంగా ఆరేళ్లుగా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తూ పార్టీ కోసం అందులోంచి ఎంత కేటాయించింది.. ఏయే సేవా కార్యక్రమాలకు ఎంత విరాళంగా ఇచ్చింది వివరంగా చెప్పాడు జనసేనాని. కొన్ని నెలల కిందటి నుంచి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ప్రతి కుటుంబానికి ఒక్కో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ జనసేనాని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి తన మానవత్వాన్ని పవన్ చాటుకున్నాడు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం అక్కడ పదుల సంఖ్యలో ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని పవన్ నిర్ణయించాడు. ఈ లక్షతో బాధితులకు ఇల్లు వచ్చేయదు కానీ.. ఎంతో కొంత సాంత్వనగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
ఇల్లు కూల్చినందుకు ప్రభుత్వం కొంత పరిహారం ఇవ్వొచ్చు కానీ.. వాళ్లకు జరిగిన నష్టానికి అది సరిపోకపోవచ్చు. జనసేన ప్లీనరీకి పొలాలు ఇచ్చారని, ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనే కక్ష సాధింపుతోనే ప్రభుత్వం పట్టుబట్టి రోడ్డు విస్తరణ పేరు చెప్పి ఇళ్లను కూల్చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ఆ గ్రామంలో పర్యటించడమే కాక.. ఇప్పుడీ ఆర్థిక సాయం ప్రకటించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates